Friday, November 22, 2024

నేడు మోడీ రాక

- Advertisement -
- Advertisement -

Narendra Modi will visit Hyderabad today

ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో , రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి స్వాగతం, కార్యక్రమం అనంతరం వీడ్కోలు చెప్పనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
శ్రీరామానగరం దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్, డిజిపి
అటు యాదాద్రి ఇటు ముచ్చింతల్ హైదరాబాద్‌కు రెండువైపులా అద్భుత దర్శనీయ క్షేత్రాలు : సిఎస్ సోమేశ్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. రంగారెడ్డి ముచ్చింతల్‌లో రామానుజచార్య సహస్రాబ్ధి వేడుకలతో పాటు పటాన్‌చెరులోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో మోడీ పాల్గొననున్నారు. ఈమేరకు శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. కాగా ప్రధానికి ప్రభుత్వ పక్షాన రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకునున్నారు. అదేవిధంగా పర్యటన పూర్తయ్యాక ప్రధానికి వీడ్కోలు చెప్పే బాధ్యతలను కూడా ఆయనే నిర్వర్తించనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

తెలంగాణాకు మరో పర్యాటక తలమానికం కానున్న ముచ్చింతల్ : సిఎస్ సోమేశ్‌కుమార్

మనశంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన శ్రీ రామానుజుల విగ్రహం ఉన్న శ్రీరామనగరం తెలంగాణా రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని సిఎస్ సోమేశ్ కుమార్ ఆకాంక్షించారు. ముచ్చింతల్ లో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమం సందర్బంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం నాడు డిజిపి మహేందర్ రెడ్డి తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి సిఎస్ పరిశీలించారు. ఈ సందర్బంగా సిఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకంలో చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ ఆలయం హైదరాబాద్ కు ఒక వైపు అద్భుత దర్శనీయ క్షేత్రంగా మారనుండగా, మరో వైపు 216 అడుగుల ఎత్తైన సమతా మూర్తి విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కలిగిన ముచ్చింతల్ మరో అద్భుత క్షేత్రంగా మారనుందన్నారు. ముచ్చింతల్ లోని శ్రీరామ నగరం ప్రపంచంలోని వైష్ణవ ఆరాధకులకు ప్రధాన క్షేత్రంగా మారుతుందని అన్నారు. ప్రధాని, రాష్ట్రపతి ఇతర ప్రముఖుల పర్యటనలతోపాటు ఈ నెల 12వ తేదీ వరకు జరిగే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విసృ్తత ఏర్పాట్లను చేసిందన్నారు.

ఈ ఉత్సవాల ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా పరిశీలించారని, సి.ఎం ఆదేశాల మేరకు ఏర్పాట్లను సమీక్షించడానికి డిజిపి, ఇతర సీనియర్ అధికారులతో ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు. వివిధ సామాజిక మాధ్యమాలు, వార్తా ఛానెళ్లలో వచ్చే అనుకూల, ప్రతికూల వార్తలను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు ఆదేశాలు అందచేసే విభాగాన్ని ఏర్పాటు చేశామని, 1035 యాగ కుండలిలు ఏర్పాటు చేసిన యాగశాలను, అక్కడ అగ్నిమాపక శాఖ, విద్యుత్, శానిటేషన్ విభాగాలు చేసిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామన్నారు. ప్రధాని, ఇతర ప్రముఖులు దిగే హెలిపాడ్‌ను, ప్రధాని స్వల్ప సమయం బస చేసే గెస్ట్ హౌస్, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజుల విగ్రహ స్థలాన్ని పరిశీలించామన్నారు. ప్రధాని ఆవిష్కరించనున్న సమతా మూర్తి విగ్రహ పరిసర ప్రాంతాలు, ప్రధాని వచ్చే మార్గాలు, దేశప్రధానితో పాటు పాల్గొనే వారి జాబితాను కచ్చితంగా ఎస్‌పిజి అనుమతించాల్సి ఉంటుందని దివ్యక్షేత్రంలోని నిర్వాహకులకు స్పష్టం చేశామన్నారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రాంతంలో బందోబస్తుపై సంబంధిత అధికారులతో సమీక్షించామన్నారు.

అనంతరం డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానితోపాటు ఇతర ప్రముఖుల పర్యటనలతో పాటు ఈనెల 12 తేదీ వరకు జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లను చేపట్టిందని పేర్కొన్నారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన రోజుల్లో ముచ్చింతల్ ఆశ్రమానికి సాధారణ ప్రజలకు అనుమతిలేదని, కేవలం ప్రత్యేక పాసులు కలిగిన వారిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకై దాదాపు 8 వేలకుపైగా పోలీసు అధికారులతో బందోబస్తు ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటించడం జరుగుతుందని, మొత్తం కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్సవాలలో మూడవ రోజైన శుక్రవారం నాడు నిర్వహించిన అష్టాక్షరీ మంత్ర జపం, పూర్ణాహుతి అనంతరం శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి సి.ఎస్. సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి లతోపాటు ఇతర అధికారులకు ప్రసాదాన్ని అందించారు. దివ్యక్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించిన కార్యక్రమంలో అడిషనల్ డిజి లు జితేందర్, ఇంటలిజెన్స్ అడిషనల్ డిజి అనిల్ కుమార్, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News