Monday, December 23, 2024

నరేంద్ర మోడీ దశాబ్ది పాలన

- Advertisement -
- Advertisement -

మనం బుర్రను పక్కన పెట్టి చెవులప్పగిస్తే ఎదుటివారు రాజస్థాన్‌లో సముద్రం, హిమాలయాల్లో భరించలేని వేడి, ఎండిపోయిన బంగాళాఖాతం అంటూ ఎన్ని కబుర్లు అయినా చెబుతారు. ఈ మధ్యనే ప్రపంచ ఆర్థిక వేదిక మీద 34 ముప్పుల్లో తప్పుడు సమాచారంలో భారత్ మొదటి స్థానంలో ఉందని ప్రపంచ వ్యాప్తంగా 1,490 వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సర్వేచేసినపుడు వెల్లడైన నిష్ఠూర సత్యం. విశ్వగురువుగా నరేంద్ర మోడీకి ప్రపం చం నీరాజనాలు అర్పిస్తున్నదని చెబుతున్నవారు దీని గురించి ఏం చెబుతారో తెలియదు. అలాంటి ముప్పులో భాగమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మీద విడుదల చేసిన శ్వేతపత్రంలోని అంశాలు.పదేండ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినపుడు దేశం సంక్షోభ స్థితిలో ఉందని, దాని గురించి చెబితే పెట్టుబడులు పెట్టేవారు ప్రతికూలంగా ఆలోచిస్తారని, అందుకే అప్పుడే శ్వేత పత్రం ప్రకటించకుండా ఇపుడు పరిస్థితి బాగుపడినందున విడుదల చేస్తున్నట్లు మొదటి పేరాలోనే జనాన్ని తప్పుదారి పట్టించారు. నిజంగా ఇప్పుడు పరిస్థితి బాగుపడిందా, దాని అర్ధం ఏమిటి ? ఏటా రెండు కోట్ల ఉపాధిని పెంచుతామని 2014లో చెప్పారు.

వాస్తవ పరిస్థితి ఏమిటి? బిజెపి అధికారానికి రాక ముందు ఉన్న సమాచారం ప్రకారం 2012లో నిరుద్యోగం 2.1 శాతం. అది 2018లో నేషనల్ సర్వే సంస్థ సమాచారం ప్రకారం 6.1 శాతానికి చేరింది. దేశ కార్మికశక్తి సర్వేల ప్రకారం అంతకు ముందు 45 సంవత్సరాలతో పోలిస్తే అది అధికం. 1524 సంవత్సరాల యువతలో నిరుద్యోగం ఎంత అన్నది ప్రధానంగా చూడాలి. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ ప్రకారం 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 22.4% మందికి ఉపాధి లేదు. తరువాత 2022లో 23.22 శాతం, తొమ్మిది సంవత్సరాల సగటు 24.74% ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పించి ఉంటే ఈ పెరుగుదల ఎలా సంభవించింది? మాక్రోట్రెండ్స్ సమాచారం ప్రకారం 1524 ఏండ్ల వయస్సులోని యువత కార్మిక శక్తిలో 2014లో 31.64% ఉండగా, మోడీ ఏలుబడిలో 2022లో 28.04 శాతానికి తగ్గింది. విద్య పెరిగిన కొద్దీ యువతలో నిరుద్యోగ శాతం కూడా పెరుగుతున్నదనే అంశాన్ని ఎందుకు మూసిపెడుతున్నట్లు ? నరేంద్ర మోడీ గొప్పగా చెప్పుకొనే నైపుణ్యం తీరు ఎలా ఉంది. 2021 భారత నైపుణ్య నివేదిక ప్రకారం దాదాపు సగం మంది డిగ్రీ కలిగిన వారు నిరుద్యోగులు. ప్రైవేటు కాలేజీలు పెరిగినందున నైపుణ్యాలు లేని పట్టాదారులు తామర తంపరగా పెరిగారన్నది మింగుడుపడ ని వాస్తవం. అందుకే ప్రభుత్వం 2015లో జాతీయ నైపుణ్య విధానాన్ని ప్రకటించింది.

కార్మిక శక్తిలో 40 కోట్ల మందికి 2022 నాటికి నైపుణ్యాలను పెంచుతామని చెప్పారు. జరిగిందేమిటి? 2012లో కార్మికశక్తిలో వృత్తి విద్యావంతులు లేదా శిక్షణ పొందిన వారు 2.3% కాగా, మోడీ శిక్షణ తరువాత 2.4 శాతానికి మాత్రమే పెరిగారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం పిఎంకెవివై (నైపుణ్య శిక్షణ) మూడు రకాలుగా శిక్షణ పొందిన వారు 18, 45, 4 లక్షల మంది చొప్పున ఉన్నారు. వారిలో 14, 43, 7 శాతాల చొప్పున ఉపాధి పొందినట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ తీరుతెన్నుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సాంకేతిక విద్య అభ్యసించిన ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారిలో నిరుద్యోగం గత పది సంవత్సరాల్లో రెట్టింపైంది. మన దేశంలో 2030 వరకు ఉపాధిని కోరుకొనే వారి సంఖ్య ఏటేటా గణనీయంగా పెరగనుందని వర్తమాన ధోరణి వెల్లడిస్తోంది. అంటే నిరుద్యోగమూ పెరగనుంది. కార్మికశక్తిలో మొత్తంగా, ప్రత్యేకించి మహిళల శాతం పెరగటం లేదన్నది అందరికీ తెలిసిందే.

ఎందుకు అన్నది సమస్య. అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో విదేశాలు తిరిగి పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు తెచ్చినట్లు నరేంద్ర మోడీ చెప్పారు. పది సంవత్సరాల తరువాత జనానికి అందినవాటి ఫలితాలేమిటో చెప్పరు. తమ వికసిత భారత్ నినాదంతో త్వరలో చైనా, అమెరికాలను మించిపోతామని చెబుతున్నారు. ఎంతగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నప్పటికీ మన దేశంలో పెట్టుబడి వాతావరణం వ్యాపారం చేసేందుకు పెద్ద సవాలుగా ఉందని 2022 నివేదికలో అమెరికా చెప్పింది. రక్షణాత్మక చర్యలు, భారతీయ ప్రమాణాల నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరలేకపోవటం వంటి కారణాలను దానిలో పేర్కొన్నారు. అంతేకాదు ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ సూచిక 2023 నివేదిక ప్రకారం 131వ స్థానంలో మన దేశం ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 39 దేశాల్లో 27 వదిగా ఉంది.

దేశ ప్రతిష్ఠను, పలుకుబడిని పెంచానని, భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పుకోవటమే తప్ప కనిపించటం లేదు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో 2022లో తొలి పది దేశాల్లో మనం పదవ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 388, రెండవదిగా ఉన్న చైనాకు 180 బిలియన్ డాలర్లు వస్తే మన దేశానికి వచ్చింది 50 బి. డాలర్లు. విదేశీ పెట్టుబడుల సంగతి అలా ఉంటే చైనా జిడిపిలో 50 శాతం పెట్టుబడులు పెడుతుంటే మన దేశంలో 30 శాతమే ఉంది. చైనా ఉత్పాదక రంగం జిడిపికి 30% సమకూర్చుతుంటే మన దగ్గర 20 శాతమే ఉంది. యుపిఎ పాలనలో ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేశారు, మా పాలనలో ఎలా వేశామో చూడండి అని బిజెపి అడ్డుసవాళ్లు విసురుతుంది. మౌలిక సదుపాయాలకు గాను 2013 14లో జిడిపిలో 1.7% ఉన్న మొత్తాన్ని 2022 23లో 2.9 శాతానికి పెంచాం చూడండి అని చెబుతారు. పదేండ్ల సగటు 1.93 శాతం.

ఇక్కడ సమస్య పెట్టుబడి వ్యయాన్ని పెంచాల్సిందే అది అవసరాలకు తగినట్లుగా ఉండాలి. పారిశ్రామిక ఉత్పత్తి లేకుండా ఎన్ని రోడ్లు, రైలు మార్గాలు వేసినా, ఓడరేవులను అభివృద్ధి చేసినా ప్రయోజనం ఏముంటుంది.
పెట్రోలు, డీజిలుమీద విపరీతంగా సెస్‌లను పెంచారు. ఎందుకు అంటే దేశ రక్షణకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలనే మనోభావాన్ని ముందుకు తెచ్చారు. ఇది నిజమా? కేంద్ర ప్రభుత్వ 202223 ఆర్థిక సర్వే 60వ పేజీలో ఇచ్చిన సమాచారం ప్రకారం 2013 14లో జిడిపిలో 1.1% కేటాయిస్తే 2022 23లో 0.9 శాతంగా ప్రతిపాదించారు. పదేండ్ల సగటు 1.04%. ఈ కాలంలో చేసిన అప్పులు 4.5 నుంచి 6.4 శాతానికి చేరాయి. పదేండ్ల సగటు 4.99%. దీనికి అనుగుణంగానే వడ్డీ చెల్లింపులు 3.3 నుంచి 3.6 శాతానికి పెరిగాయి. అచ్చేదిన్ గురించి కబుర్లు చెప్పిన పెద్దలు సబ్సిడీ మొత్తాన్ని 2.3 నుంచి 1.2 శాతానికి దిగ్గోశారు. పదేండ్ల సగటు 1.74%. ముందే చెప్పినట్లుగా అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల ఖర్చు పెరగాలి.

దాని కోసం సంక్షేమ కార్యక్రమాల ఖర్చు తగ్గింపు సమర్థ్దనీయమా? పారిశ్రామిక ఉత్పత్తి విలువ తమ ఏలుబడిలో ఎంత పెరిగిందో చూడమని మోడీ భక్తులు చెబుతారు. ఆ మేరకు ఉపాధి ఎందుకు పెరగలేదో చెప్పలేరు.మరోవైపు జిడిపిని ఎంత పెంచామో చూడండి అంటా రు. ప్రపంచ బ్యాంకు విశ్లేషించిన దాని ప్రకారం 2014లో మన పారిశ్రామిక ఉత్పత్తి విలువ 307 బిలియన్ డాలర్లు, అది 2022 నాటికి 450 బి.డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో జిడిపిలో దాని వాటా 15 నుంచి 13.32 శాతానికి దిగజారింది. కార్మిక శక్తిలో 15 24 సంవత్సరాల వయస్సు వారు ఎందరున్నారు అంటే 2014లో 31.64% ఉంటే 2022 నాటికి 28.04కు పడిపోయింది.

దీని అర్ధం ఏమిటి ఉపాధి రహిత వృద్ధి జరుగుతున్నది. దీని వలన కార్పొరేట్ల సంపద పెరుగుతుంది తప్ప జనానికి దక్కేదేముంది. ఏ దేశమైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నపుడు డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి. దాని వలన వివిధ రంగాలు కొంతమేరకు సానుకూలంగా స్పందిస్తాయి. ఉదాహరణకు రోడ్ల నిర్మాణం జరిపితే సిమెంటు, ఉక్కు, చమురు, రోడ్డు నిర్మాణ వాహనాలు తదితర ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఈ కారణంగానే 2020 21లో మూలధన వ్యయం కేంద్ర బడ్జెట్‌లో రూ. 4.26 లక్షల కోట్లుండగా, 2023 24లో రూ. 10 లక్షల కోట్లకు పెంచారు. (ఎన్నికల సంవత్సరం కదా!) ఒక్కసారిగా ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు. రైల్వే, రోడ్లు, రక్షణ రంగం వాటా 66% ఉంది. రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలకు ఇచ్చే 50 ఏండ్ల వడ్డీ లేని రుణ మొత్తం అంతకు ముందు ఉన్న రూ. 76 వేల కోట్లను లక్షా 30 వేల కోట్లకు పెంచారు.

ఇదే సమయంలో కొన్ని రంగాలకు ఎలా కోతలు పెట్టారో చూద్దాం. 2009 తరువాత తొలిసారిగా సామాజిక సంక్షేమ ఖర్చు 18 శాతానికి తగ్గింది. 2023 24 బడ్జెట్‌లో రూ. 8.28 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకు ముందు సంవత్సరం కంటే 56 వేల కోట్లు తక్కువ. విద్యారంగానికి కేటాయింపులు 2009 2021 మధ్య 20 నుంచి 9 శాతానికి తగ్గాయి. 2023 24లో 14% ఉన్నప్పటికీ తక్కువే కదా! గ్రామీణాభివృద్ధి కేటాయింపులు 28 నుంచి 19 శాతానికి తగ్గాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి వాటికి తగ్గటం లేదా గిడసబారి ఉన్నాయి. పదకొండు సాంఘిక సంక్షేమ రంగాలలో కరోనాకు ముందు 2019 20లో ఉన్న కేటాయింపుల కంటే 2023 24లో ఐదింటిలో తగ్గాయి. అవి స్వచ్ఛభారత్, సమగ్ర విద్యా శిక్షణ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం. రాష్ట్రాలు తమ వాటాను చెల్లించని కారణంగా కొన్ని పథకాలకు నిధులు పెంచలేదని కేంద్ర అధికారులు చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రంగాలకు పెంచారు. మొత్తంగా చూసినపుడు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చే మౌలిక సదుపాయాలకు ఖర్చు పెంపుదల కోసం కోట్లాది మంది సంక్షేమానికి చేసే ఖర్చును కోత పెడుతున్నారు లేదా మంచం చాలకపోతే కాళ్లు ముడుచుకొని సర్దుకోమని చెప్పినట్లుగా చేస్తున్నారు.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News