మనతెలంగాణ/ హైదరాబాద్: శాసనమండలి సమావేశాల్లో విద్య, వైద్యానికి సంబంధిత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వెల్లడించారు. శుక్రవారం శాసనమండలి సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన గన్‌పార్క్‌లోని మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి 18వ సారి నిర్వహించే సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, విద్యావలంటీర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. మోడల్ స్కూల్స్‌లో పీడిలను వెంటనే నియమించాలన్నారు. విద్యాశాఖలోని సమస్యల పరిష్కారానికి నిబంధనలు సడలించి మంత్రికే పలు అధికారాలు అప్పగించేలా సిఎం ఆదేశాలు జారీ చేయాలన్నారు. పిఆర్‌సి విద్యాశాఖలోని మరికొంత మంది ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారిందన్నారు. రాష్ట్రంలోని ప్రజాసమస్యలపై శాననమండలిలో ప్రస్తావిస్తామన్నారు. మీడియా పాయింట్‌ను శాసనమండలి, శాసనసభ ప్రాంగణంలోనే నిర్వహించాలని స్పీకర్, చైర్మన్‌లను కలిసి కోరుతామని, ఈ మేరకు లేఖను అందజేస్తామని ఆయన వెల్లడించారు.