అంగారక గ్రహంపై పరిశోధనలు సాగిస్తున్న పెర్సెవరెన్స్ రోవర్ అనే అంతరిక్ష పరిశోధన నౌక మరింత ముందుకెళ్లి మరో కొత్త ప్రయోగం కోసం మొదటి నమూనాను సేకరించ గలిగింది. కారు అంత సైజున్న ఈ రోవర్ అంగారక గ్రహంపై జెజెరో క్రేటర్ ( బిలం) కు చెందిన డెల్టాను అధిరోహించి నమూనాను సేకరించిందని నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ తాజా నమూనా మిషన్‌కు చెందిన 16 వ ముఖ్యమైన శిలల నమూనా. శాస్త్రవేత్తలు బెరియా (berea) అని పిలిచే శిల నుంచి మార్చి 30న ఈ నమూనా సేకరించడమైంది. ప్రాచీన కాలం నాటి నదీ ప్రవాహ అవశేషాల ద్వారా ఈ బెరియా శిలాజం ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జెజెరో బిలం పరిధి దాటి ఈ అవశేషాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ శిల అవశేషంపై శాస్త్రవేత్తలు ఆసక్తి చూపించడానికి మరో కారణం ఏమంటే ఇందులో కార్బొనేట్ మూలకం సమృద్ధిగా లభించడమని నాసా పెర్సెవరెన్స్ ప్రాజెక్టు సైంటిస్టు కటీ స్టాక్ మోర్గాన్ వెల్లడించారు. శిలాజ జీవిత రూపాలను పరిరక్షించడానికి భూమిపై కార్బొనేట్ శిలలు చాలా అనుకూలంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. జెజెరో బిలంభాగమైన నమూనాలో జీవి చిరునామా ఉన్నట్టయితే , అది దీనివలె శిలాజ అవశేషం కావచ్చునని, అందులో ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉండి ఉంటాయని అంచనాగా చెప్పారు. అంగారక గ్రహంపై ఇప్పుడున్న ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు నీటితో నిండి ఉన్నట్టయితే గ్రహ వాతావరణం ఏ విధంగా ఉండేదో శాస్త్రవేత్తలకు పజిల్‌గా మారింది. ఎందుకంటే ద్రవ రూపంలో ఉన్న నీటిలో అంతర్గత రసాయన చర్యల వల్ల కార్బొనేట్‌లు ఏర్పడతాయి.
గ్రహంపై వాతావరణంలో సుదీర్ఘకాలంగా రికార్డు స్థాయిలో వచ్చే మార్పుల వివరాలను శాస్త్రవేత్తలకు అందించగలవు. బెరియా నమూనా లోని కార్బొనేట్‌ను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తల బృందం ఇంతవరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేలా సహకారం లభిస్తుంది. అంగారక గ్రహం ఉపరితలంపై 45 కిమీ వైశాల్యం గలిగిన జెజెరో బిలం వద్ద 2021 ఫిబ్రవరిలో ఆరు చక్రాల పెర్సెవరెన్స్ దిగింది. గ్రహంపై ప్రాచీన జీవి ఉనికి కోసం వెతుకుతోంది. భవిష్యత్తులో భూమిపై వచ్చేటప్పుడు తీసుకురాడానికి కావలసిన నమూనాలను పోగు చేసుకుంది. ఇంతవరకు మొత్తం 19 నమూనాలను సేకరించింది.