Monday, December 23, 2024

ఆఖరి దశలో నాసా “ఇన్‌సైట్ ల్యాండర్ ”

- Advertisement -
- Advertisement -

అంగారక గ్రహం అంతర్గత స్వరూపం,లోపలి పొరలు, ప్రకంపనలు, వాతావరణం, ఇవన్నీ పరిశీలించే మానవ రహిత రోబో నాసాకు చెందిన “ఇన్‌సైట్ ల్యాండర్‌” ఆఖరి దశకు చేరుకుంది. అంగారక గ్రహం ఉపరితలానికి చేరుకుని ఇప్పటికి నాలుగేళ్లయింది. స్వయం చోదక శక్తి అయిన విద్యుత్ సరఫరా కొన్ని నెలలుగా క్షీణించి పోవడంతో భూమి నుంచి వచ్చే కమ్యూనికేషన్‌కు స్పందించి వెంటనే సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని నాసా ధ్రువీకరించింది కూడా. ఇన్‌సైట్ అధికారిక ట్విటర్ అకౌంట్ వీడ్కోలు సందేశంతోపాటు ఫోటో పంపించింది.

బహుశా అదే ఇన్‌సైట్ ల్యాండర్ నుంచి వచ్చిన ఆఖరి ఫోటో కావచ్చు. “నిజంగా నా పవర్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు నేను పంపించే ఫోటో ఆఖరిది కావచ్చు. నాగురించి వర్రీ కావద్దు. ఇక్కడ నా సమయం అంతా ఉత్పాదకత, ప్రశాంతత తోనే సాగింది. నా మిషన్ టీమ్‌తో మాట్లాడగలిగితే తప్పకుండా చేస్తా. కానీ ఇక్కడ త్వరలోనే నా సంతకం చెరిగిపోతుంది. నాతో ఉంటున్నందుకు కృతజ్ఞతలు ” అని ఇన్‌సైట్ ల్యాండర్ నుంచి సందేశం వచ్చింది. ఇన్‌సైట్ ల్యాండర్ తుది ఫోటోలో గోపురం ఆకారంలో సెయిస్మోమీటర్ అంగారక గ్రహం ఉపరితలంపై కూర్చుని ఉన్నట్టు కనిపిస్తోంది.

అంగారక గ్రహం “నాడి”ని ఇది పసికట్టడానికి నిరీక్షిస్తోంది. అంగారక గ్రహ ప్రకంపనలు ఇది గ్రహించగలుగుతుంది. ఈ విధంగా గ్రహం అంతర్గత చర్యను దృశ్యంగా చూపించగలుగుతుంది. ఇన్‌సైట్ ల్యాండర్‌కు రెండు ఇంజినీరింగ్ కెమెరాలు ఉన్నాయి. ఒకటి ఇన్‌సైట్ భుజానికి అమర్చి ఉండగా, మరొకటి ముందు భాగంలో అమర్చి ఉంది. ఇవే తుది ఇమేజ్‌ను చిత్రించగలిగాయి. విద్యుత్‌శక్తిలో మార్పుకు ఏది దోహదం చేసిందో తెలీదు. ఈనెల 15న ఇన్‌సైట్‌తో మిషన్ అనుసంధానం కావడం అదే ఆఖరిసారి. ఇన్‌సైట్‌తో అనుసంధానం కాడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారని నాసా పేర్కొంది.

2018 మే 5న ఇన్‌సైట్ ల్యాండర్ ప్రయోగం జరిగింది. అదే సంవత్సరం నవంబర్ 26న అంగారక గ్రహం పైన ఇన్‌సైట్ కాలుమోపింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తాను సాధించిన పరిశోధన విశేషాలను పరిశీలిస్తే అంగారక గ్రహంపై మొట్టమొదటిసారి భూకంపాన్ని కనుగొనగలిగింది. దాదాపు 1300 భూకంప సంఘటనలను సెయిస్మోమీటర్ గుర్తించగలిగింది. ఈ ఏడాది మే లో కూడా రిక్టార్ స్కేలుపై 5 తీవ్రత ఉన్న భూకంపాన్ని కనుగొనగలిగింది. ఈ ప్రకంపనలు గ్రహంపై దాదాపు ఆరు గంటల పాటు కొనసాగాయని వివరించింది. అంగారక గ్రహం కు మూడు పొరలు ఉన్నాయని కొత్తగా కనుగొంది.

పై పొర క్రస్ట్‌గా, మధ్య పొర మేంటిల్‌గా, అడుగుపొర కోర్‌గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రస్ట్ పొర అడుగున అనుకున్నదానికన్నా పలుచగా ఉన్నట్టు తేలింది. ఇది 25 నుంచి 40 కిలోమీటర్ల వైశాల్యంతో ఉంది. ఇన్‌సైట్ తీసుకెళ్లిన మేగ్నోమీటర్ సాధనం అయస్కాంత సంకేతాలను కనుగొనడానికి ఉపయోగపడింది. అంగారక అడుగు పొరలో విద్యుత్ తరంగాలు ప్రవహించేవని, అయితే రానురాను ఈ గ్రహం చాలా వేగంగా చల్లారిందని గత చరిత్ర చెబుతోంది. భౌగోళిక అయస్కాంత క్షేత్రం గతించినా, ఇంకా నిల్వలు స్ఫటికశిలల్లో గడ్డకట్టి ఉంది. ఈ ప్రాచీన శిలలు దాదాపు కొన్ని మైళ్ల పొడవునా డుగున విస్తరించి ఉన్నాయని పరిశోధన వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News