పురాతన గ్రహ శకలాల పరిశోధన కోసం
12 ఏళ్లపాటు గురు గ్రహం వెలుపల ప్రదక్షిణలు..
వాషింగ్టన్: అమెరికా రోదసీ పరిశోధనా సంస్థ నాసా శనివారం ‘లూసీ’ అనే అంతరిక్ష నౌకను గురుగ్రహపు పురాతన గ్రహ శకలాల పరిశోధన కోసం పంపింది. లూసీని మోసుకువెళ్లే అట్లాస్ వి రాకెట్‌ను కేప్ కేనరాల్ పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించారు. లూసీ 12 ఏళ్లపాటు గురుగ్రహం వెలుపల ప్రదక్షిణలు చేయనున్నది. లూసీలో ఏర్పాటు చేసిన పరికరాలు సూర్య కుటుంబం ఏర్పాటుకు సంబంధించన పలు అంశాలను సేకరించనున్నాయి. లూసీ అనే పేరు మానవ పూర్వీకులైన అస్థిపంజరానిది. గతంలో ఏ ప్రోబూ పరిశీలించనన్ని గ్రహ శకలాలను(ఎనిమిదింటిని) లూసీ దర్శించనున్నది. ఇది రోదసిలోకి పంపుతున్న మొదటి సౌరనౌక. ఒక్కో గ్రహ శకలం సూర్య కుటుంబం ఏర్పాటుకు సంబంధించిన ఒక్కో అంశాన్ని తెలియజేస్తుందని నాసా సైన్స్ మిషన్‌లోని అసోసియేట్ చీఫ్ థామస్ జుర్‌బుచెన్ తెలిపారు.
లూసీ మొదటగా 2025లో డోనాల్డ్ జోహన్సన్ అనే గ్రహశకలం(ఆస్టరాయిడ్) సమీపానికి చేరుకుంటుంది. ఇది ఆస్టరాయిడ్ మెయిన్ బెల్ట్‌లోని గ్రహ శకలం. గురు, అంగారక గ్రహాల మధ్య ఉన్న గ్రహ శకలాల సమూహాన్ని ఆస్టరాయిడ్ బెల్ట్ అంటారు. లూసీ 20272033 మధ్య ఏడు పురాతన గ్రహశకలాలను సమీపిస్తుంది. వీటిలో అయిదు గురు గ్రహం చుట్టూ తిరిగేవి. మరో రెండు గురు గ్రహం వెనకాల తిరిగేవి. వీటిలో అతిపెద్ద గ్రహశకలపు వ్యాసం 95 కిలోమీటర్లు. లూసీ తాను పరిశోధించే గ్రహ శకలాల ఉపరితలాలకు 400 కిలోమీటర్ల సమీపంలోకి వెళ్తుంది. వాటి భౌతిక నిర్మాణం, ద్రవ్యరాశి,సాంద్రత, ఘనపరిమాణంలాంటి అంశాలను క్రోడీకరించే పరికరాలను లూసీతో పంపారు. గురు గ్రహంలో వాయువులు ఎక్కువగా ఉండటం వల్ల గ్యాస్ జెయింట్‌గా పిలుస్తారు.