విజయవంతంగా అంగారకుడిపై ల్యాండయిన ‘పర్సెవరెన్స్’ రోవర్
రెండేళ్ల పాటు పరిశోధనలు జరపనున్న రోవర్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన రోవర్ ‘ పర్సెవరెన్స్’ అంగారక గ్రహంపై విజయవంతంగా దిగింది. ఆ తర్వాత అంగారక గంరహనికి చెందిన రెండు చిత్రాలను కూడా పంపడంతో నాసా శా్రస్త్రవేతల సంతోషం మిన్నంటింది. ‘పెర్సి’ అనే ముద్దుపేరున్న పర్సెవరెన్స్ అంగారక గ్రహంపై గురువారం రాత్రి గ్రీనిచ్ కాలమానం ప్రకారం 20.55 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.25 గంటలకు) ల్యాండ్ అయినట్లు నిర్ధారణ అయింది. గత ఏడాది జూలై 30న కేప్ కెనవరాల్‌నుంచి ప్రయోగించిన పర్సెవరెన్స్ దాదాపు 203 రోజుల పాటు 472 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం అంగారకుడి ఈక్వేటర్ (మధ్య రేఖ)కు సమీపంలోని జెజెరో అనే లోతైన బిలం సమీపంలో దిగినట్లు వెల్లడైంది. ఆరు చక్రాలున్న పర్సెవరెన్స్ కనీసం రెండు సంవత్సరాల పాటు అంగారకుడిపై ఉండి పరిశోధనలు కొనసాగిస్తుంది.
ఇందులో భాగంగా అక్కడ జీవం ఉందా అనే విషయాన్ని కనుగొనేందుకు అంగారకుడిపై ఉన్న రాళ్ల ఉపరితలాన్ని తొలిచి లభించిన మట్టి తదితరాలను విశ్లేషిస్తుందని నాసా శాస్త్రజ్ఞులు తెలిపారు. కాగా దాదాపు 3.5 బిలియన్ సంవత్సరాలక్రితం జెజెరో ప్రాంతంలో ఒక సరోవరం ఉండి ఉంటుందని వారు భావిస్తున్నారు. నీరు ఉన్న నేపథ్యంలో జీవం కూడా ఉండి ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ల్యాండ్ అయిన తర్వాత పర్సెవరెన్స్ తక్కువ రిసల్యూషన్ కలిగిన ఇంజనీరింగ్ కెమెరాల సాయంతో అంగారకుడిఫొటోలను తీసింది. కాగా రోవర్‌కు ముందు వెనక కూడా ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా ఉన్నట్లు ఈ చిత్రాల ద్వారా వెల్లడైంది.ఈ ఘన విజయంతో కాలిఫోర్నియాలో మిషన్‌ను పర్యవేక్షిస్తున్న నాసా ఇంజనీర్లలో ఆనందం పెల్లుబుకింది.