సూర్యునిపై సౌరజ్వాలలు అసాధారణమైన రీతిలో ప్రజ్వరిల్లుతుంటాయి. ఈ సౌర జ్వాలల నుంచి సమీప భూ పరిధి, కృష్ణబిలాల వరకు విశ్వమంతటా ప్లాస్మాలు విస్తరిస్తుంటాయి. ప్లాస్మా అంటే అత్యంత శక్తివంతమైన ద్రవపదార్థం వంటిది. అయస్కాంత క్షేత్రాలకు ప్లాస్మా ఉద్రిక్తమౌతుంది. ప్లాస్మాలు వేగంగా అయస్కాంత శక్తిని ఉష్ణం గాను, చలనం చెందే విధం గానూ మార్చుతాయి.
ఈ మాగ్నెటిక్ రీకనెక్షన్ ( అయస్కాంత పునస్సంధానం)లో అనేక రకాలున్నాయి. వీటిలో ఒకటి ముఖ్యంగా ఫాస్ట్ రీకనెక్షన్ అని పేర్కొనే అస్పష్టమైన వేరియంట్ ఉంది. ఇది ఊహాజనిత స్థాయిలో సంభవిస్తుంది. అయితే ఈ వేగవంతమైన స్థాయిని వాస్తవంగా ఏది ముందుకు నడిపిస్తుందో అన్నది అంతుచిక్కడం లేదని నాసా వివరించింది. అంతరిక్షంలో ఎక్కడైతే రీకనెక్షన్ సంభవిస్తుందో ప్లాస్మా చాలావరకు సంఘర్షించే శక్తి కోల్పోతుందని అంటున్నారు.
సౌరజ్వాలల్లోని ప్లాస్మా అయినా, భూమి చుట్టూ అంతరిక్షం లోనైనా ప్లాస్మా స్తబ్దతగా మారిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు అరవై ఏళ్లుగా సూర్యుని సౌరజ్వాలలపై నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. సూర్యునిపై పేలుళ్లు ( విస్ఫోటనాలు ) ఏ విధంగా ఏర్పడతాయో వివరిస్తూ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు.
దీనివల్ల భూమిపై ప్రభావం చూపించే భూఅయస్కాంత తుపాన్లు, సౌరజ్వాలలను ముందుగానే కనుక్కోడానికి వీలు కలుగుతుంది. ఒక సౌరజ్వాల మొత్తం ప్రపంచానికి 20,000 సంవత్సరాలకు సరిపడే విద్యుత్తును విడుదల చేయగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సౌరజ్వాలల వెనుక విస్ఫోటన ప్రక్రియ ప్రభావం ఉంటుంది. దీనినే మేగ్నటిక్ రీకనెక్షన్ అని అంటారు.