నాసా పరిశోధనల్లో మరో ముందడుగు
వాషింగ్టన్ : నాసాకు చెందిన పెర్సెవరెన్స్ రోవర్ అంగారక గ్రహంపై సాగిస్తున్న పరిశోధనల్లో మరో మైలు రాయి సాధించింది. ఆరు చక్రాల ఈ రోబో వరస విజయాలు అందిస్తోంది. అంగారక గ్రహంపై మొట్టమొదటి సారి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలిగింది. అంగారక వాతావరణం లోని పలుచగా సమృద్ధిగా ఉంటే కార్బన్‌డైయాక్సైడ్ ను ఆక్సిజన్‌గా మార్చడంలో ముందంజ వేసింది. పెర్సవరెన్స్ రోవర్‌లో అమర్చిన మోక్సీ ( మార్స్ ఆక్సిజన్ ఇన్ సిటు రీసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్ ) అనే పరికరం వాతావరణం లోని కార్బన్‌డైయాక్సైడ్‌ను గ్రహించి ఎలెక్ట్రాలిసిస్ ప్రక్రియ ద్వారా కార్బన్‌డైయాక్సైడ్‌ను విచ్ఛిన్నం చేసి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 20న జరిగింది. అంటే ఫిబ్రవరి 18న అంగారక గ్రహం పైకి పెర్సెవరెన్స్ చేరుకున్న దగ్గర నుంచి అరవై రోజులకు ఇది సాధించ గలిగింది. ఈ మొదటి ప్రయోగంలో మోక్సీ ఐదు గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగా, ఇది వ్యోమగాములకు అందించే పది నిముషాల విలువైన శ్వాసకు సమానం అని నాసా వెల్లడించింది.