సూర్యుడి అన్వేషణ నిమిత్తం దానికి అత్యంత సమీపం లోకి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సురక్షితంగా ఉందని నాసా శుక్రవారం వెల్లడించింది. సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా పరిశోధన నిమిత్తం శాస్త్రవేత్తలు దాన్ని పంపించారు. అది సూర్యుడికి అతి సమీపం లోకి వెళ్లిన తరువాత తాత్కాలికంగా దాని నుంచి సంకేతాలు అందలేదని అధికారులు పేర్కొన్నారు. వాటికోసం శుక్రవారం వరకూ వేచి చూడాలని భావించారు. అయితే .. ఆ సంకేతాలు గురువారమే అందినట్టు పేర్కొన్నారు. గురువారం రాత్రి పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి సంకేతం వచ్చిందని మేరీలాండ్ లోని జాన్ హాష్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ వెల్లడించింది. డిసెంబరు 24న సౌర ఉపరితలానికి 6.1 మిలియన్ కిలో మీటర్ల దూరం లోకి వెళ్లి , సూర్యుడికి అత్యంత దగ్గరగా చేరినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఏ వ్యోమనౌక సూర్యుడికి ఇంత దగ్గరగా వెళ్లలేదని పేర్కొన్నారు.
ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ జనవరి 1న తన పరిశోధనలకు సంబంధించిన వివరణాత్మక టెలిమెట్రీ డేటాను పంపనుందని నాసా పేర్కొంది. ఈ పరిశోధనల వల్ల సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనా ప్రాంతం లోని కణాలు మిలియన్ల డిగ్రీల వరకు ఎలా వేడెక్కుతాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు అర్ధం చేసుకోవడానికి వీలవుతుందని తెలిపారు. నాసాతోపాటు పలు ఇతర పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పార్కర్ ప్రోబ్‌ను సంయుక్తంగా రూపొందించారు. నాసా తెలిపిన వివరాల ప్రకారం …పార్కర్ సోలార్ ప్రోబ్ 1800 డిగ్రీల ఫారెన్‌హీట్ (982 డిగ్రీల సెల్సియస్ ) వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేలా దాని చుట్టూ పటిష్ఠ కవచం ఉంటుంది. నమూనాల సేకరణకు ఉపయోగించేందుకు బిగించిన కప్, మరో పరికరం మాత్రం కవచం బయట ఉంటాయి. అవి కరిగిపోకుండా టంగ్‌స్టన్, నియోబియం, మాలిబ్డినమ్, సఫైర్ వంటి పదార్థాలతో వాటిని తయారు చేశారు. కరోనా పొరపై ఏడేళ్లపాటు పరిశోధనలు జరపడమే ప్రాథమికలక్షంగా నాసా 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించింది. ఈ వ్యోమనౌక 2021 ఏప్రిల్ 28న తొలిసారి కరోనా పొరలోకి ప్రవేశించింది.