వెల్లింగ్టన్ : నాసాకు చెందిన కేప్‌స్టోన్ శాటిలైట్ సోమవారం భూమి చుట్టూ ఉన్న కక్షను అధిగమించి చంద్రుని వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మైక్రోవేవ్ ఒవెన్ సైజులో ఉండే ఈ శాటిలైట్ ఈ విధంగా చంద్రుని వైపు ప్రయాణాన్ని ప్రారంభించడం చెప్పుకోదగిన ఘట్టం. చంద్రుని ఉపరితలం పైకి మరోసారి వ్యోమగాములను చేర్చడానికి నాసా చేస్తున్న ప్రయత్నానికి ఇదొక విధంగా నాంది. న్యూజిల్యాండ్ మహియా ద్వీపం నుంచి ఆరు రోజుల క్రితం దీన్ని ప్రయోగించారు. చిన్నతరహా ఎలెక్ట్రాన్ రాకెట్లను తయారు చేసే రాకెట్ ల్యాబ్ కంపెనీ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. చంద్రుని ఉపరితలం చేరడానికి ఈ శాటిలైట్‌కు మరో నాలుగు నెలలు పడుతుంది.
ఈ ప్రయోగం విజయవంతమౌతున్నందుకు రాకెట్ ల్యాబ్ సంస్థాపకులు పీటర్ బెక్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం తమకు రెండున్నరేళ్లు పట్టిందని, ఇప్పుడు చంద్రుని వైపు వెళ్తుండడం పూర్తిగా ఒక ఇతిహాసం వంటిదని ఆయన అభివర్ణించారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ శాటిలైట్ కోసం నాసా 32.7 మిలియన్ డాలర్లను వెచ్చించిందని చెప్పారు. మిషన్‌లో మిగతా ఘట్టం విజయవంతమై చంద్రుని చుట్టూ ఉన్న కొత్త కక్షకు ఈ శాటిలైట్ చేరుకుంటే కొన్ని నెలల పాటు అక్కడి సమాచారం పంపుతుందని వివరించారు. చంద్రుని కక్షలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఆర్టెమిస్ కార్యక్రమం కింద చంద్రుని పైకి వ్యోమగాములను దింపాలన్నది నాసా ప్రణాళిక.