Friday, November 22, 2024

చంద్రయాన్ 3 ల్యాండర్‌ను “పింగ్ ” చేసిన నాసా వ్యోమనౌక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన నాసా వ్యోమనౌకపై ఉన్న లాసర్ సాధనం చంద్రునిపై ఉన్న భారత దేశానికి చెందిన చంద్రయాన్ 3 ల్యాండర్‌ను విజయవంతంగా ‘పింగ్’ చేసింది. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది. ఈ ప్రయత్నంలో చంద్రుని ఉపరితలంపై మొదటిసారి నాసా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఒ), విక్రమ్ ల్యాండర్ పై ఉన్న ఒరియో సైజులో ఉన్న సాధనం మధ్య లేజర్ కాంతి పుంజం ప్రసారమై ప్రతిబింబించింది. విజయవంతమైన ఈ ప్రయోగం చంద్రుని ఉపరితలంపై లక్షాలను కచ్చితంగా గుర్తించే కొత్త విధానానికి తలుపులు తెరిచిందని నాసా వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ 12న నాసా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఒ)కు 100 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ద్రువ ప్రాంతంలో మంజినస్ బిలం సమీపంలో ఉన్న విక్రమ్ ల్యాండర్ వైపు లేజర్ కిరణాలను ప్రసారం చేసింది. చిన్న నాసా రెట్రో రిఫ్లెక్టర్ నుంచి తిరిగి వచ్చిన కాంతిని ఆర్బిటర్ నమోదు చేయడంతో తమ సాంకేతిక ప్రక్రియ కచ్చితంగా చివరకు పనిచేసిందని నాసా శాస్త్రవేత్తలు నిర్ధారించుకోగలిగారు.

ఒక వస్తువు వైపు లేజర్ కాంతిని పంపడం, ఎంత సమయంలో తిరిగి ఆ కాంతిని గ్రహించడమౌతుందో లెక్క గట్టడం అనేది సాధారణంగా ఉపయోగించే ప్రక్రియ. నేలపై నుంచి భూ కక్షలో పరిభ్రమించే శాటిలైట్ల ఉనికిని గుర్తించడానికి ఈ ప్రక్రియను వినియోగిస్తుంటారు. చంద్రుని కక్ష నుండి ఉపరితలంపై మన రెట్రో రిఫ్లెక్టర్‌ను గుర్తించవచ్చని తాము నిరూపించినట్టు నాసా శాస్త్రవేత్త జియోలీసన్ వెల్లడించారు. మేరీల్యాండ్ గ్రీన్‌బెల్టు లోని నాసాకు చెందిన గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో శాస్త్రవేత్తల బృందానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. నాసా, ఇస్రో పరిస్పర భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరిగింది. తదుపరి చర్యలో భాగంగా ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ఈ రెట్రోరిఫ్లెక్టర్స్‌ను ఉపయోగించాలనుకునే అంతరిక్ష ప్రయోగాలకు ఇది రొటీన్ పద్ధతి అవుతుందని జియోలీసన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం రెండు అంగుళాలు లేదా 5 సెంటీమీటర్లు వెడల్పులో ఉండే నాసా చిన్న రెట్రోరిఫ్లెక్టర్ చాలా శక్తివంతమైనది.

దీన్ని లాసర్ రెట్రోరిఫ్లెక్టర్ ఏరే అని పిలుస్తారు. ఇందులో ఎనిమిది స్ఫటికమూలలఘనాకాల పట్టకాలు (క్వార్ట్ కార్నర్ క్యూబ్ ప్రిజమ్స్ ) ఉంటాయి. ఇవి అల్యూమినియం ఫ్రేమ్‌తో అమర్చబడి ఉంటాయి. ఏ కోణంలోనైనా ఇవి లేజర్ కాంతి కిరణాలను ప్రసారం చేస్తాయి. ఈ పరిణామంపై ఇస్రో వివరిస్తూ చంద్రయాన్3 ల్యాండర్ లోని లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే (ఎల్ ఆర్ ఎ)పరికరం చంద్రుని దక్షిణ ద్రువం దగ్గర లొకేషన్ మార్కర్‌గా పనిచేయడం ప్రారంభించిందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News