అనంత విశ్వరహస్యాలను అధ్యయనం చేయడమే అంతిమ లక్ష్యం గా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు తమ జీవితాలను త్యాగం చేశారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన భారీ ప్రయోగం స్పియరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీ మళ్ళీ యావత్ ప్రపంచానికి ఓ సరికొత్త సవాల్‌గా మారింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆధ్వర్యంలో కాలిఫోర్నియా నుంచి స్పియరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీను, నాలుగు ఉపగ్రహాలతో కలిపి నాసా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. అనంత విశ్వానికి సంబంధించిన పూర్తి ఖగోళ సమాచారం, అంతరిక్షపు పూర్తి చిత్రపటాన్ని మానవాళికి అందించే ప్రధాన లక్ష్యంతో ఈ టెలిస్కోప్ అబ్జర్వేటరీ పనిచేస్తుంది.
పాలపుంతల ఆవిర్భావం ఎలా జరిగింది? బిగ్ బ్యాంగ్‌కు సంబంధించిన కాస్మిక్ వెలుగుల జాడ ఎలా వుండేది? గెలాక్సీల సంఖ్య ఎంత? వంటి ఎన్నో సందేహాలకు త్వరలోనే మనం జవాబులు వెతకవచ్చు. ఇప్పటివరకు మన విజ్ఞానప్రగతి చూడని కొత్తకోణంలో విశ్వాన్ని ఆవిష్కరించబోతుంది ఈ ప్రయోగం. ఈ అబ్జర్వేటరీతోపాటు అంతరిక్షంలోకి వెళ్ళిన నాలుగు ఉపగ్రహాలు సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. మన సౌరకుటుంబానికి సూర్యుడే అధిపతి. సూర్యుని ఆవిర్భావంగురించి సమగ్ర శాస్త్రీయ సమాచారం పొందితేనే మనం విశ్వ సరిహద్దుల అంతాన్ని చూడగలం.
అనంత శక్తి విషయంలో సూర్యుని ఉపరితలంపై జరిగే రసాయన చర్యలపై శాస్త్రవేత్తలకు ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు శతాబ్దాలుగా ప్రయాణం చేస్తూనే వున్నాయి. ఏనాటికైనా సూర్యునిపై మనిషి అడుగులు పెట్టాల్సిన అవసరం కోసం మానవ ప్రయత్నం ఎప్పటికీ కొనసాగుతూనే వుంటుంది. 488 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ టెలిస్కోప్ అబ్జర్వేటరీ దాదాపు 500 కెజీల బరువు ఉంటుంది. కోన్ ఆకారంలో ఉండే ఈ అబ్జర్వేటరీ పరారుణ కిరణాల సాయంతో అందమైన అంతరిక్షాన్ని పరిశీలిస్తూ ఆరు నెలలకొకసారి తాను దర్శించిన ఖగోళ పటానికి సంబంధించిన 3డీ చిత్రాన్ని రూపొందిస్తుంది.
ఈ టెలిస్కోప్ అబ్జర్వేటరీ అందించే ఖగోళ సమాచారం విశ్లేషణలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్‌లు కూడా సహాయకారిగా వుండబోతున్నాయి. స్పియరెక్స్ అబ్జర్వేటరీ రెండు సంవత్సరాల పాటు అంతరిక్షంలో తన విధులను నిర్వర్తిస్తూ విశ్వానికి సంబంధించిన సమగ్ర ఖగోళ సమాచారంతో పాటు, బిగ్ బ్యాంగ్‌కు సంబంధించిన ఎన్నో రహస్యాల గుట్టును విప్పనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20వ శతాబ్దపు శాస్త్రవేత్తల అన్వేషణలో బయటపడ్డ సంచలన సత్యాలైన గురుత్వాకర్షణ తరంగాలు, బ్లాక్ హోల్స్, విశ్వం విస్తరిస్తూనే వుంది వంటి పలు అంశాలు విశ్వాన్ని అర్థం చేసుకోవడంలో, విశ్వార్భావం, పరిణామ క్రమంలో ఎన్నో చిక్కుముడులను సృష్టించాయి.
అయినా శాస్త్రవేత్తలు తమ ఆత్మవిశ్వాసంతో, అలుపెరగని బాటసారులుగా విశ్వరహస్యాల అన్వేషణలో శతాబ్దాలుగా సుదూర ప్రయా ణం, ప్రయత్నాల పరంపరను కొనసాగిస్తూనే వున్నారు. చంద్రుడు, అంగారక గ్రహలపై బుడిబుడి అడుగుల ప్రయాణంలో కొంత పురోగతి సాధించారు. ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అన్నట్లు ‘ఈ విశ్వం ఎంత పెద్దదైనా కావోచ్చు..! కానీ నీ ప్రయత్నం ముందు చాలా చిన్నదే..!’ నూతన వెలుగు రాకకై చీకటి దారిలో మనిషి వేసే ప్రతి అడుగు భవిష్యత్తు తరాలకు ఓ ముందడుగే..! శాస్త్రీయ దృక్పథంతో త్వరలోనే అంతరిక్ష పరిశోధనల్లో మనమంతా ఎన్నో విప్లవాత్మక ఫలితాలను సాధించాలని ఆశిద్దాం.