Monday, December 23, 2024

చంద్రునిపై మరిన్ని పరిశోధనల కోసం ఆర్టిమిస్ 3..

- Advertisement -
- Advertisement -

చంద్రునిపై మంచినీటి జాడలతోపాటు ఏయే మూలకాలు ఉన్నాయో అవి భవిష్యత్తులో మానవ మనుగడకు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకోడానికి ఆర్టిమిస్3 అంతరిక్ష యాత్రకు నాసా సిద్ధమైంది. ఈ మేరకు 2024లో చంద్రుని దక్షిణ ద్రువంపై వ్యోమగాములను పంపడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 13 ల్యాండింగ్ సైట్లను గుర్తించింది. ఈ వ్యోమగాముల బృందంలో ఒక నల్లజాతీయుడుతోపాటు ఇంతవరకు కాలుమోపని మహిళా వ్యోమగామి కూడా ఉన్నారు. అపోలో యాత్ర తరువాత ఇంతపెద్ద ఎత్తున వ్యోమగాములను పంపడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ 13 ల్యాండింగ్ సైట్లు ఒక్కొక్కటి చంద్రుని దక్షిణ ద్రువంపై 6 డిగ్రీల అక్షాంశంలో ఉన్నాయి. ఇవి విభిన్న భౌగోళిక లక్షణాలతో ఉన్నాయి. ఈ రీజియన్లన్నీ శాశ్వతంగా నీడ కలిగినవే.

ఇంతవరకు మానవుల కంట పడని ఖనిజాల సంపద ఇక్కడ ఉంది. ఈ ప్రాంతాలన్నీ లోయలతో కూడుకున్నవి. అపోలో యాత్రలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్ నేతృత్వంలో వ్యోమగాములు ఎక్కడైతే చంద్రుని భూమధ్యరేఖ వద్ద దిగారో ఆ ప్రాంతం కన్నా ఈ 13 ల్యాండింగ్ సైట్లు చాలా కఠినమైన ప్రాంతాల్లో ఉన్నాయి. ఇదివరకు ఎవరూ పరిశోధించని చంద్రుని చరిత్ర ఈ ఆర్టిమిస్ యాత్ర వల్ల తెలుస్తుందని భావిస్తున్నారు. అమెరికా, జర్మనీ సంయుక్తంగా ప్రయోగించిన స్ట్రాటోస్ఫియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్‌ఫ్రారెడ్ ఆస్ట్రానమీ (సోఫియా) అనే అంతరిక్ష నౌక పంపించిన డేటా ఆధారంగా చంద్రునిపై ఉన్న నీటి వనరులకు సంబంధించిన మ్యాప్‌ను రూపొందించారు.

చంద్రుడిలో మన కంటికి కనిపించే భాగంలో నాలుగింట ఒకవంతు భాగాన్ని ఈ మ్యాప్ కవర్ చేస్తోంది. చంద్రునిపై నీటి జాడలు పూర్తిగా తెలుసుకోడానికి ఇది ఉపయోగపడుతుంది. అక్కడున్న నీటిని ఎలా ఉపయోగించుకోవాలో అన్న దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. గతంలో చంద్రుని ఉపరితలంతోపాటు లోపలి భాగంలో కూడా నీటి ఉనికిని గుర్తించారు. ఈ నీరు మంచు గడ్డల రూపంలో నిక్షిప్తమై ఉందని తెలుసుకున్నారు. అయితే చంద్రునిపై నీరు ఎలా పుట్టిందో మూలాలు తెలుసుకోవాలన్న ఆకాంక్షతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News