ఫ్లోరిడా: చంద్రుడిపైకి మానవులను రవాణా చేసే అవకాశాల పరిశీలన నిమిత్తం నాసా ఆర్టెమిస్1 మిషన్‌ను గత నవంబర్ 16న చేపట్టింది. ఇందులో భాగంగా ప్రయోగించిన ‘ఓరియన్ క్యాప్సూల్’ నేడు భూ వాతావరణంలోకి ప్రవేశించనున్నది. ఈ క్యాఫ్సూల్ పసిఫిక్ మహా సముద్రంలో పడనున్నది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు ఇది సముద్రంలో పడొచ్చని నాసా అంచనా. క్యాప్సూల్ మెక్సికన్ ద్వీపం గ్వాడాలుపే నుండి ఆదివారం (స్థానిక సమయం ఉదయం 9:39) 17:39 GMTకి స్ప్లాష్ అవుతుందని భావిస్తున్నారు.
ఈ క్యాఫ్సూల్ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ వారం కిందటే మొదలయింది. అయితే ఇంజిన్ల శక్తిమంతమైన కదలికల కారణంగా స్పేస్ క్యాఫ్సూల్ దిశ మారింది. దాంతో చంద్రుడి ఉపరితలం నుంచి భూమి వైపుకు పయనించడం ప్రారంభించింది. ఇది భూమికి తిరిగొచ్చే సమయంలో గంటకు 40వేల కిమీ. వేగంతో దూసుకురానుంది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత గరిష్ఠ వేగాన్ని ఇది అందుకుంటుందని అనుకుంటున్నారు. అయితే పసిఫిక్ సముద్రంలో పడే సమయానికి దీని వేగాన్ని గంటకు 32 కిమీ. మేరకు నియంత్రించనున్నారు. ఇది మెక్సికో దగ్గర బజా కాలిఫోర్నియా తీరంలో పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.