Monday, December 23, 2024

మత్తును చిత్తు చేసే “నశా ముక్త భారత్ అభియాస్‌”

- Advertisement -
- Advertisement -

మత్తు పదార్ధాలకు , మాదకద్రవ్యాలకు యువత బానిసలైపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఎక్కువ శాతం మందిలో ఈ వ్యవసనం తీవ్రంగా ఉంటోంది. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దేశంలో మాదక ద్రవ్య వినియోగదారుల సంఖ్య 6 కోట్లకు పైగా ఉంది. వీరిలో ఎక్కువ మంది 10 నుంచి 17 ఏళ్ల వయసు వారే. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా 500 స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే ఈ రుగ్మతను నివారించగలమన్న ఆలోచనతో నశా ముక్త భారత్ అభియాస్ కార్యక్రమం కేంద్ర సామాజిక , న్యాయ మంత్రిత్వశాఖ నేతృత్వంలో మొదలైంది.

మత్తు బాధితులకు సరికొత్త జీవితాన్ని అందించడానికి తెలుగు రాష్ట్రాల్లో సుమారు వంద డీ అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మాదక ద్రవ్యాలు తీసుకుంటే వ్యసనపరుల్లో వివిధ విచిత్ర అనుభూతులు కలుగుతుంటాయి. మొదట్లో ఆనందం కలుగుతుంది. కానీ రానురాను శరీరం ఆ ప్రభావాలు తట్టుకోలేదు. మునుపటిలా సంతోషం, ఆనందం కలగవు. అందువల్ల మరింత ఎక్కువ మోతాదులో తీసుకోవాలనే కోరిక కలుగుతుంది. కొంత కాలానికి అది కూడా చాలదు. రానురాను మోతాదు పెరిగిపోయి మెదడు లోని నాడీ కణాల్లో మార్పులు వస్తాయి. చివరికి మాదక ద్రవ్యాలు లేకపోతే ఉండలేని దీనస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో భారత దేశాన్ని మాదక ద్రవ్య రహిత సమాజంగా తీర్చి దిద్దాలనే నశాముక్త భారత్ అభియాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. మత్తుకు బానిసలైన వారిని ఈ కేంద్రాలకు ఎలాగో కష్టపడి తీసుకు వస్తే మూడు నెలల పాటు చికిత్సలో వైద్య పరీక్షలు చేస్తారు. హెమోగ్లోబిన్ శాతం, కాలేయం, మూత్రపిండాలు పనితీరు, మానసిక స్థితి పరిశీలిస్తారు.

క్షయ, కామెర్లు, సోకాయేమోనని పరీక్షిస్తారు. ఆ తరువాత నాలుగు రోజులు సోషల్ వర్కర్లు, సైకియాట్రిస్టులు, డాక్టర్లు కౌన్సెలింగ్ ఇస్తారు. ఒక్కసారి మత్తు అలవాటు మాన్పించడంతో చేతులు వణకడం, కోపతాపాలు ప్రదర్శించడం , వింతగా ప్రవర్తించడం బాధితులు చేస్తుంటారు. ఈ సమయంలో యాంటీ టాక్సిఫికేషన్ మందుల్ని అందిస్తారు. అయితే ఈ వ్యసనం తీవ్రమైతే డ్రగ్స్ రకాల బట్టి బెంజోడైజపీన్స్, నాల్‌ట్రెక్సాన్, మెథడాన్ వంటి మందులతో చేతులు, కాళ్లు వణకడం, ఆందోళన వంటి లక్షణాలను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. క్రమంగా ఈ మందుల వాడకాన్ని తగ్గిస్తారు. పరిస్థితి కుదుటపడ్డాక పూర్తిగా మందులు ఆపేస్తారు. ఫలితంగా శరీరంలో మాదక ద్రవ్యాల దుష్ఫ్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. కొందరు తిరిగి మాదక ద్రవ్యాలకు అలవాటు పడవచ్చు. అందువల్ల యాంటీ క్రేవింగ్ మందులు కూడా ఇస్తారు. ఇవి మాదక ద్రవ్యాలు తీసుకోవాలన్న కోరిక లేకుండా చేస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News