మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికాలోని డాలస్ మహానగరంలోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన నాటా (ఉత్తర అమెరికా తెలుగు సమితి) మహాసభలలో కరీంనగర్ సమైక్య సాహితి అధ్యక్షుడు కవి రచయిత వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాటా సాహిత్య విభాగం సమన్వయకర్త డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ కవిగా రచయితగా వ్యాఖ్యాతగా సాహిత్య కార్యక్రమాల నిర్వాహకునిగా మాడిశెట్టి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
అనంతరం మాడిశెట్టి గోపాల్ జానపద సాహిత్య ప్రస్థానం అనే అంశం పైన ప్రసంగిస్తూ ఆదిమ కాలం నుండి జానపదం మనిషి జీవితం తోనే ముడివడి ఉన్నదని అన్నారు. పని నుండి పాట పుట్టిందని, ఆటవిక దశ, గ్రామీణ దశ, ఆధునిక దశలలో జానపద సాహిత్య ప్రస్థానాన్ని సవివరంగా వివరించారు.
ఈ కార్యక్రమం లో ప్రఖ్యాత రచయిత్రి బలభద్రపాత్రుని రమణి, ఆకెళ్ళ బాలభాను, తానా పూర్వ అధ్యక్షులు తోటకూర ప్రసాద్, వంగూరి చిట్టెన్ రాజు, సింగిరెడ్డి శారద, జువ్వాడి రమణ, కందిమల్ల సాంబశివరావు మాడిశెట్టిని శాలువా, జ్ఞాపిక, బోకే లతో ఘనంగా సన్మానించారు. మాడిశెట్టి విదేశాలలో జరిగే సాహిత్య సభలలో పాల్గొనడం ఇది రెండవసారి. ఈ సందర్భంగా మాడిశెట్టికి అడిషనల్ కలెక్టర్ జివి శ్యాం ప్రసాద్ లాల్, సమాచార, పౌరసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ డి శ్రీనివాస్, డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, దాస్యం సేనాధిపతి, సాహితీ గౌతమి అధ్యక్ష కార్యదర్శులు నంది శ్రీనివాస్, కొత్త అనిల్ కుమార్, సమైక్య సాహితి సహ అధ్యక్షుడు డాక్టర్ బి వి ఎన్ స్వామి, ప్రధాన కార్యదర్శి కె ఎస్ అనంతాచార్య కందుకూరి అంజయ్య తదితరులు అభినందనలు తెలిపారు.