లండన్: ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌తో బుధవారం ప్రారంభమైన యాషెస్ రెండో టెస్టు మ్యాచ్‌లో నాథన్ లియాన్ తన కెరీర్‌లో అత్యంత అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా వందో టెస్టు మ్యాచ్ ఆడిన తొలి బౌలర్‌గా లియాన్ చరిత్ర సృష్టించాడు. లార్డ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లియాన్‌కు వరుసగా వందో మ్యాచ్ కావడం విశేషం. ఈ క్రమంలో వరుసగా వంద టెస్టు మ్యాచ్‌లు ఆడిన తొలి బౌలర్‌గా లియాన్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. గతంలో ఏ బౌలర్ కూడా ఇలాంటి అరుదైన ఫీట్‌ను సాధించలేదు.
లియాన్ మాత్రం తన పేరిట ఈ అరుదైన రికార్డును సృష్టించాడు. 2013 ఆగస్టు నుంచి లియాన్ వరుసగా ఆస్ట్రేలియాకు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మధ్యలో ఒక్కసారి కూడా అతను ఆస్ట్రేలియా టీమ్‌కు దూరం కాలేదు. ఓవరాల్‌గా లియాన్ తన కెరీర్‌లో 121 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అయితే వీటిలో వరుసగా వంద టెస్టులను ఆడి ఔరా అనిపించాడు. లియాన్ ఇప్పటి వరకు టెస్టుల్లో 495 వికెట్లను పడగొట్టాడు. ఇదిలావుంటే ఏ క్రికెటర్‌కైనా టెస్టుల్లో వంద మ్యాచ్‌లు ఆడడం అరుదైన రికార్డే.
అలాంటిదే వరుసగా వంద టెస్టుల్లో ఆడడం అంటే గొప్ప విషయమే. బౌలర్‌కైతే ఇలాంటి ఫీట్‌ను సాధించడం కష్టమైన అంశమే. అయినా లియాన్ ఇలాంటి అత్యంత అరుదైన మైలురాయిని అందుకోవడం విశేషం. మరోవైపు చారిత్రక రికార్డును సాధించిన లియాన్‌ను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు అభినందించారు.