ఉత్తమ కోవిడ్‌వారియర్ అవార్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ సమయంలో విశేష సేవలందించిన డిఐజి సుమతి కి ఉత్తమ కోవిడ్ వారియర్ జాతీయ పురస్కారం దక్కింది. ఈక్రమంలో న్యూఢిల్లీలో ఆదివారం నాడు జాతీయ మహిళా కమీషన్ 29 వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా డిఐజి సుమతి ఈ పురస్కారం అందుకున్నారు. కోవిడ్ సందర్బంగా ప్రకటించిన లాక్ డౌన్ లో దేశంలో విశేష సేవలందించిన పలువురు మహిళలను, అధికారులను కమీషన్ గుర్తించి జాతీయ మహిళల కమీషన్ ప్రత్యేక పురస్కారాలను అందచేసింది. ఈ అవార్డుకు తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన డి.ఐ.జి సుమతిని ఎంపిక చేసిన విషయం విదితమే. ఇదిలావుండగా డిఐజి సుమతి కోవిడ్ లాక్ డౌన్ సందర్బంగా ప్రజలకు నిత్యావసర వస్తువులైనా ఆహార ధాన్యాలు, మందులు, రవాణా తదితర అవసరాలకు ఏవిధమైన లోటు రాకుండా తెలంగాణ పోలీస్ శాఖ ద్వారా కట్టు దిట్టమైన చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ శాఖలతో పాటు దాదాపు 90 స్వచ్ఛంద సంస్థల సహాయంతో నిత్యావసర వస్తువులు, మందులను ప్రజలకు ప్రధానంగా వలస కూలీలకు అందచేయడంలో సుమతి కీలక పాత్ర వహించారు. వలస కూలీల సహాయానికి, కోవిద్ నియమావళి కట్టు దిట్టంగా అమలు చేయడం, కోవిడ్ వైద్యులు, వైద్య సిబ్బంది 24 /7 అందుబాటులో ఉంచేందుకై రూపొందించిన సేవా యాప్ ను సమర్థవంతంగా ఉపయోగించడంలో ఆమె కీలకపాత్ర వహించారు. దీనితోపాటు, లాక్ డౌన్ సమయంలో గృహహింస పై డయల్ 100 కు వచ్చే కాల్స్ కు వెంటనే స్పందించేందుకై 24 మంది సైకాలజిస్టులను ప్రత్యేకంగా నియమించి వెంటనే స్పందించి తగు కౌన్సిలింగ్ చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. ఈ విధమైన ఉత్త్తమ సేవలిందించినందుకు గుర్తింపుగా డి.ఐ.జి. సుమతి కి జాతీయ మహిళా కమీషన్ ఈ ప్రత్యేక పురస్కారాన్ని ఆదివారంనాడు న్యూ ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో అందచేసింది. కాగా డిఐజి సుమతికి జాతీయ పురస్కారం అందడంతో రాష్ట్ర డిజిపి, ఇతర ఉన్నతాధికారులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.