Monday, December 23, 2024

రాష్ట్రానికి అవార్డుల పంట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తెలంగాణ రెడ్కో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇంధన పరిరక్షణ రంగంలో చేస్తున్న కృషికి గాను జాతీయ అవార్డు వరించింది. గ్రూప్ 2 లోని రాష్ట్రాల్లో తెలంగాణకు నిర్దేశిత సంస్థగా ఉన్న తెలంగాణ పునరుత్పాధక ఇంధన అభివృద్ధి సంస్థ(రెడ్కో) సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకుంది. 32వ జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఢిల్లీ, విజ్ఞాన్ భవన్ లోబుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్ కుమార్ సింగ్ గారి చేతుల మీదుగా తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య ఈ అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఇంధన పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఈ అవార్డు వరించిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇంధన పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల వాడకాన్ని తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. దేశంలోనే తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ను మున్సిపల్ యాక్ట్ లో చేర్చిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందన్నారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా భవన నిర్మాణ దశ నుంచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే పరిశ్రమల్లోనూ విద్యుత్ ఆదా అయ్యే విధంగా యంత్రాల వినియోగం, మార్పులపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో నాసిరకం మోటార్లతో అధిక విద్యుత్ వినియోగం జరగకుండా.. వాటి స్థానంలో స్టార్ రేటెడ్ మోటార్ల ఏర్పాటుకు రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

అలాగే.. ప్రభుత్వ హాస్పిటళ్లు, పోస్టాఫీసులు, పోలీస్ స్టేషన్లు, స్కూళ్లు, దేవాలయాల్లో విద్యుత్ అధికంగా వినియోగమయ్యే లైట్లు, ఫ్యాన్లు తొలగించి తక్కువ విద్యుత్ తో పనిచేసే ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశామని రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పంపుసెట్లలోనూ విద్యుత్ ఆదా అయ్యే విధంగా మార్పులు చేసినట్టు చెప్పారు. ఇంధన పరిరక్షణకు కృషి చేసిన వారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెడ్కో ఆధ్వర్యంలో అవార్డులు కూడా ఇస్తూ ప్రోత్సహిస్తోందని సతీష్ రెడ్డి చెప్పారు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రెడ్కో సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోందని.. వీటన్నింటిని గుర్తించిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ.. రాష్ట్రానికి అవార్డు ప్రకటించిందని తెలిపారు.

ఈ అవార్డు తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని.. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు.. ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని సతీష్ రెడ్డి అన్నారు. తమకు వెన్నంటి ఉండి సహాయసహకారాలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ , , ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ కు అలాగే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కి, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మకు ధన్యవాదాలు తెలిపారు. ఇష్టపడి పనిచేస్తూ అవార్డు సాధించిన రెడ్కో ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News