Wednesday, January 22, 2025

జాతీయ స్థాయిలో బిసి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

జాతీయ స్థాయిలో బిసి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి
ప్రధానికి ఆర్.కృష్ణయ్య లేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : జనాభాలో 56 శాతం ఉన్న బిసిల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రధాని నరేంద్ర మోడికి లేఖ రాశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా బిసిల కోసం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 56 శాతం ఉన్న బిసిలు విద్యా, ఆర్థిక, సామాజిక ంగా వెనుకబడి ఉన్నారని ఆయా రంగాల్లో బిసిల అభ్యున్నతికి, సరైన మార్గనిర్దేశనం చేయడానికి, పర్యవేక్షించడానికి ప్రత్యేక విభాగం ఉండాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు.

సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన 75 కోట్ల మంది ప్రజల సమగ్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్షం వహిస్తూ వస్తున్నాయని ఆవేవదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో విద్యా, ఉద్యోగ రంగాల్లో ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని, జాతీయ బిసి కమిషన్, జాతీయ బిసి కార్పొరేషన్ తో పాటు ఒబిసిలకు ప్రత్యేకంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఒబిసిల కోసం ప్రి మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్, రుణాలు తదితర అనేక పథకాలు అమలు చేస్తోందని ఇవి సక్రమంగా అమలు కావాలంటే కేంద్ర స్థాయిలో ప్రత్యేకంగా బిసి మంత్రిత్వశాఖ అవసరమని ఆయన ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

15 శాతం, 7 శాతం ఉన్న ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక ప్రభుత్వ విభాగాలను ఏర్పాటు చేసిన కేంద్రం 56 శాతం జనాభా ఉన్న బిసిలకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయకపోవడాన్ని ఆయన తన లేఖలో గుర్తు చేశారు. అనేక రాష్ట్రాలు బిసిల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖలను ఏర్పాటు చేశాయని కేంద్ర స్థాయిలోనే ఇప్పటికీ ప్రత్యేక మంత్రిత్వశాఖ లేకపోవడం బాధకరమని అన్నారు. బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందని, దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే 75 కోట్ల మంది బిసిలకు గౌరవించినట్లు అవుతుందని ఆయనన్నారు. ఈ డిమాండ్‌కు ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించదని పేర్కొన్నారు. వెంటనే బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బిసిల చిరకాల వాంఛను ను గౌరవించాలని, బిసిల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News