Sunday, December 22, 2024

శ్రమను కళాత్మకం చేసిన పెంబర్తి

- Advertisement -
- Advertisement -

మానవ శ్రమను దేశవ్యాప్తంగా ఆవిష్కరించిన గొప్ప సాంస్కృతిక, పర్యాటక గ్రామం పెంబర్తి. మానవ శ్రమకు కళాత్మకతను అద్ది ప్రపంచాన్ని తన ముంగిట నిలుపుకుంది ఈ పెంబర్తి గ్రామం. ఇత్తడిని పుత్తడి బొమ్మ చేసే నైపుణ్యత పెంబర్తి హస్త కళాకారుల ప్రత్యేకత. చేయి తిరిగిన ఎన్నో కళాకృతులు ప్రపంచానికి అందించిన తీరు ఇప్పటిది కాదు. కాకతీయులు నుండి మొగల్ చక్రవర్తులు వరకు అనేక కళారూపాలకు జీవంపోసిన నేల పెంబర్తి. సర్దార్ సర్వాయి పాపన్న తన పాలనా కాలంలో ఇక్కడ ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేసి ఇక్కడ నుండే ఆయుధలను సమకూర్చుకునే వాడని చరిత్రకు సజీవ సాక్షీభూతమైన కార్ఖానా ఇక్కడ ఉండేది. విశ్వకర్మ కాలనీలో వందాలది రాతిగుండ్ల పైన నిత్యం ఎన్నో ఖండాలకు జీవం పోసుకునే సాంస్కృతిక వారసత్వం పెంబర్తి గ్రామానిది. ఈ గ్రామం నుండి అనేక దేవాలయాలకు విగ్రహమూర్తులను, ఆలయ ప్రాంగణంలో స్తంభాలను, గృహ, వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో గొప్పగొప్ప కళాఖండాలను అందించిన ఊరు. తిరుమల తిరుపతి, యాదగిరి గుట్ట, వేములవాడ, శ్రీశైలం ఇలా ఎన్నో పేరెన్నికగన్న దేవాలయాలకు శిల్ప సంపద అందించిన ఘనత కలిగినది.

కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు ప్రైవేటు ఫంక్షన్లకు ఎన్నో అవార్డు ప్రతీకలు ఈ ఊరు నుండే అందిస్తారు. ఇక్కడి కళాకృతులు ప్రపంచమంతటా నేటికీ ప్రదర్శన ఇస్తున్నాయి. సంవత్సరానికి దాదాపు లక్ష మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తారు. నేషనల్ హైవే హైదరాబాదు, వరంగల్ మధ్య ఉండే ఈ గ్రామానికి రైలు సదుపాయం ఉంది. ఈ గ్రామం పూర్తిగా వృత్తి కులాలకు పుట్టిన ఇల్లు. 95% బడుగు బలహీన వర్గాలే. ఇక్కడ ఒకనాడు చేనేత వృత్తి కూడా వర్ధిల్లింది. వంద గ్రామాలకు నిత్యం రాతిబండను అందించే రాముని బండ ఎందరికో ఉపాధి అందించేది, ఊరునిండా గొల్ల కురుమ పశుసంపద, ఊరిలో మూడు పెద్ద చెరువులు, తొమ్మిది కుంటలతో గ్రామ వ్యవసాయం, స్వయం సమృద్ధి చిన్న, మధ్య తరగతి రైతులు సబ్బండ వర్గాల సాంస్కృతిక చైతన్యం, సంఘ జీవనం ఈ ఊరు ప్రత్యేకత. హస్త కళాకారుల జీవితంలో జీవం పోసింది మాత్రం స్వర్గీయ అయిల ఆచారి.1960 ప్రాంతంలో విశ్వకర్మ బ్రాస్ సొసైటీ ఏర్పాటు చేసి ఒక సంఘం స్థాపన చేశారు. పెంబర్తి హస్త కళాకారుల కళాకృతులను ఆ సంఘం సముదాయంలో పెట్టి వాటికి మార్కెట్ కల్పించారు. ఆ విధంగా అయిల ఆచారి ఈ కళను అభివృద్ధి పథంలో నడపడానికి జీవిత కాలంలో విశ్వవ్యాప్తం చేయడం లో విశేషమైన కృషి చేశారు.

ఆయన అందించిన చైతన్యం నేడు దేదీప్యమానమైన ప్రగతి సాధించి ఢిల్లీలో భారత దేశ ఉత్తమ పర్యాటక గ్రామంగా పెంబర్తి నిలవడం ఎంతో గర్వకారణం. దీనికి పెంబర్తి గ్రామ సర్పంచ్ అంబా ల ఆంజనేయలు గౌడ్ శ్రమ అనితర సాధ్యమైంది. ఈ ఊరును అన్ని రంగాల్లో విశేష ప్రగతి సాధించడంలో విశేష కృషి చేశారు.గ్రామం నుండి నేషనల్ హైవే రోడ్‌కు దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా అందమైన లైటింగ్, దానికి తగిన విధమైన చక్కటి గ్రీన్ గార్డెన్, ఊరు మొత్తం సిసి కెమెరాలతో భద్రత, రోడ్డుకు ఇరువైపులా హస్తకళాకారుల షాపులు, పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటాయి. ఊరు మొత్తం పచ్చదనంతో పరిఢవిల్లుతుంది, మొన్ననే ఈ గ్రామం ఉత్తమ పారిశుధ్య గ్రామంగా జిల్లా స్థాయి అవార్డ్డు అందుకొని ప్రగతి పథంలో వెళుతున్న సందర్భంలో జాతీయస్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందడం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పెంబర్తిలో విశ్వకర్మలు తయారు చేసే కళాఖండాలకు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారైన వస్తువులు అనేక దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.

దేవాలయాల అలంకార వస్తువులతో పాటు ధ్వజస్తంభాలు, తలుపు డిజైన్లు, దేవుని రథాల అలంకరణ, కళారూపాల తయారీ పెంబర్తి ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఇత్తడి, రాగి, కంచు, వెండిని ఉపయోగించి నగిషీలు, కిరీటాలు, ఆధ్మాత్మిక సంబంధిత వస్తువులు, షీల్డులు, పథకాలకు సంబంధించిన రూపాలు ఎంతగానో ప్రాచు ర్యం పొందాయి. ఒక్క తెలంగాణలోనే కాదు ఎక్కడెక్కడో అమెరికాలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఇత్తడి ద్వారాలు, ధ్వజ స్తంభాల తయారీకి ఇక్కడి కళారూపాలనే వినియోగించారు. అంతేగాకుండా దుబాయిలోని మక్కా మదీనాకు పెంబర్తి నుంచే మెటీరియల్ వెళ్లింది. రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ఇత్తడి, వెండి తొడుగులు పెంబర్తి హస్త కళాకారులు తయారు చేసినవే. అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలకు నిత్యం ఇక్కడి నుంచి కళారూపాలు ఎగుమతి అవుతుంటాయి. దేవతామూర్తుల విగ్రహాలు, ఆలయ అలంకరణలే కాకుండా గృహ అలంకరణ వస్తువులకు పెంబర్తి గ్రామం ప్రసిద్ధి.

ఉత్తమ చిత్రం పేరుతో సినీనటులకు ఇచ్చే హంస, నంది అవార్డులు సైతం పెంబర్తి కళాకారుల చేతిలో తయారైనవే. అనేక రంగాల్లో సత్తా చాటిన వారికి ఇచ్చే అవార్డులను తామే తయారు చేస్తామని ఇక్కడి విశ్వకర్మ కళాకారులు గర్వంగా చెబుతారు. తెలంగాణ రాష్ట్రంలో తరతరాల సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెడుతూ పెంబర్తి గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పెంబర్తి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

అంబాల నారాయణ గౌడ్
9949652024

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News