Thursday, January 23, 2025

సమగ్ర వికాసానికి పాఠ్యాంశాలే పునాది

- Advertisement -
- Advertisement -

సమర్థ మానవ వనరుల నిర్మాణానికి విద్య అత్యంత కీలకమైనది. విద్యార్జనకు కేంద్ర బిందువు పాఠశాల. ఇక్కడ అభ్యసించే పాఠ్య, సహ పాఠ్యాంశాలు విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. పాఠశాల విద్య గుణాత్మక మెరుగుదలకు దోహదారి కావాలన్నదే ఎన్‌సిఇ ఆర్‌టి ఏర్పాటు వెనుక ప్రధాన లక్ష్యం. ఇది దేశ వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల ప్రచురణ, వినూత్న విద్యా పద్ధతుల అభివృద్ధి, ఉపాధ్యాయుల శిక్షణ తదితర బాధ్యతలను నిర్వహిస్తుంటుంది. రాష్ట్ర స్థాయిలో ఎస్‌సిఇఆర్‌టి ఈ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇటీవల నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్‌అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) చేపడుతున్న పాఠ్యాంశాల సవరణ తీవ్ర వివాదాస్పదమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం చరిత్రను, వాస్తవాలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదనే విమర్శలు కూడా వస్తున్నాయి. పుస్తకాల్లో గత ఏడాది ఎన్‌సిఇఆర్‌టి ప్రకటించిన ‘పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ’ పేరిట పలు తరగతులకు చెందిన ముఖ్యమైన అంశాలను తొలగించడమే దీనికి నిదర్శనం.

దీంతో ప్రభుత్వాల సంకుచిత విధానాలు పాఠ్యాంశంలోకి చొరబడుతున్నాయానే అనుమా నం కలుగుతున్నది. దేశంలో మత పరిస్థితులపై గాంధీజీ మృతి ప్రభావం, హిందూ- ముస్లిం ఐక్యతకు గాంధీ చేసిన కృషి, అది హిందూ అతివాదులకు నచ్చకపోవడం, గాంధీజీ హత్యకు గురైన సందర్భంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై కొంత కాలం పాటు విధించిన నిషేధం వంటి అంశాలను 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి మాయం అయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవంగా గాంధీజీ మన మధ్య ప్రస్తుతం లేకున్నా ఆయన ఆచరించిన, ప్రబోధించిన సత్యం, అహింస, సహనం వంటి సూత్రాలు కొంత వరకు విద్యార్థి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అదే విధంగా మొఘల్ సామ్రాజ్యం అధ్యాయాలను ఎన్‌సిఇఆర్‌టి తొలగించింది. 12వ తరగతి చరిత్ర పుస్తకంలో థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్- 2లో ‘కింగ్ అండ్ క్రానికల్స్ : ది మొఘల్ కోర్ట్ చాప్టర్లను ఉపసంహరించారు.

11వ తరగతి సోషియాలజీ పుస్తకంలో ‘అండర్‌స్టాండింగ్ సొసైటీ’లో మతం, వర్గం, జాతులు ప్రజలను ఏ విధంగా విడదీస్తాయి? అనే దానికి గుజరాత్ అల్లర్లను ఉదాహరణగా చూపిన పెరాగ్రాఫ్‌ను తొలగించారు. ఎమర్జెన్సీ, ప్రచ్ఛన్న యుద్ధం, నక్సలైట్ ఉద్యమం తొలగించారు. 2002 మత హింసకు సంబంధించిన అంశాలను కూడా తీసేశారు. ఇలాంటి చర్యల వలన భావిబాలల్లో దేశ సమైక్యత, లౌకిక స్ఫూర్తి కొరవడి సంకుచిత భావజాలం అభివృద్ధి చెందనుంది.
ఇప్పటికే నూతన విద్యా విధానం- 2020పై పలు విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఇటీవల చరిత్ర, రాజనీతి, సామాజిక శాస్త్రాల పాఠ్యపుస్తకాల్లో తలపెడుతున్న మార్పులు చేర్పులు విద్యావేత్తలను నిర్ఘాంతపరుస్తున్నాయి. మరో వైపు చిన్నారుల్లో తార్కిక ఆలోచనలకు కేంద్ర బిందువైన డార్విన్ సిద్ధాంతం తొలగించడం విజ్ఞాన శాస్త్రాన్ని అపహాస్యం చేయడమేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎన్‌సిఇఆర్‌టి పదవ తరగతి సిలబస్ నుంచి డార్విన్ జీవ పరిణామాల క్రమం, పునరుత్పత్తి పాఠ్యాంశాల తొలగించడం మరో వివాదంగా మారింది.

ఇందుకు అభ్యంతరం తెలుపుతూ పలువురు శాస్త్రవేత్తలు, సైన్స్ అధ్యాపకులు, మేధావులు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవడానికి డార్విన్ సిద్ధాంతం ఎంతో ఉపకరిస్తుందని, అందువల్ల దీన్ని సెకండరీ స్థాయి పుస్తకాల్లో ఉంచాలని శాస్త్రవేత్తలు కోరారు. డార్విన్ పరిణామక్రమాన్ని తొలగిస్తే భావి మస్తీష్కాకాలకు జీవుల పుట్టుక, ఆవిర్భావం గురించి ఏమి చెప్పాలనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. దీనికి సైతం దైవత్వం, ఆధ్యాత్మికతతో ముడి పెడతారేమోనని అనుమానం పలువురిలో రేకెత్తుతున్నది. శాస్త్రీయ పరిష్కారాన్ని చూపిన ఈ సిద్ధాంతం జీవశాస్త్రంలో నూతన దృక్కోణాన్ని చూపింది. తొలగింపుపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందంటున్నారు. చరిత్ర ద్వారా భవిష్యత్తును నిర్మించుకుంటారు. మానవాళి బంగారు భవిష్యత్తుకు దారి చూపేది విజ్ఞానశాస్త్రం. ఈ నేపథ్యంలో ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ పేరుతో పాఠ్యపుస్తకాల్లో ఇష్టారీతన మార్పులు భావితరాన్ని అంధకారం వైపు నెట్టుతుంది. పునాదులు లేని నవతరం తయారవుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మన దేశంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. విద్యా వ్యవస్థలో జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న మార్పులు రాష్ట్రాలలో కూడా ప్రభావితం చేయనున్నాయి. ఇప్పటికే జాతీయ విద్య విధానం అమలుకు పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి సహేతుకం కానీ మార్పులు విద్యార్థుల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో గందరగోళాన్ని సృష్టిస్తున్నా యి. సిబిఎస్‌ఇ అనుబంధ పాఠశాలలో దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది విద్యార్థులు ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాలు అభ్యసిస్తున్నారు. వీరంతా సంకుచిత భావజాలాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.కావున లౌకిక ప్రజాస్వామ్య దేశంలో పాఠ్యాంశాల మార్పులు, చేర్పులో పక్షపాత ధోరణి వీడాలి. విద్యార్థి సంఘాలు, పౌర సమాజం భాగస్వామ్యంతో చర్చించి సమాజ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల ప్రక్షాళన చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.

జాతీయ విద్యా విధానం- 1986 భారత స్వాతంత్ర పోరాట చరిత్రను విద్యార్థులకు తెలియజేయాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాలని, భారతీయ సంస్కృతి వారసత్వాన్ని విద్యార్థులు గ్రహించాలని, సాంఘిక దురాచారాలను నిర్మూలించి, శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థులలో పెంపొందించాలని పేర్కొన్నది. తద్వారా జాతీయ సమైక్యతకు బాల్య దశలోని పునాది పడుతుంది. దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, శాస్త్రీయ ప్రగతి పట్ల పాఠశాల దశలోనే విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కలిగించాలి. అపుడే పౌరులకు శాంతి, సహనం, ప్రేమ, గౌరవం అలవడి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడరు. ప్రభుత్వాలు తమ విధానాలకు అనుగుణంగా పాఠ్యాంశాలలో మార్పులు ఉండకూడదు. నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల రూపకల్పనపై విద్యావేత్తల్లో మేధోమథనం జరగాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో విద్యార్థులు సమర్ధ మానవులుగా తయారవుతారు.

సంపతి రమేష్ మహారాజ్
7989579428

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News