Monday, December 23, 2024

విద్యాభివృద్ధితోనే దేశాభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మక్తల్ : విద్యాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని.. అందుకే విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మక్తల్ మండలంలోని కర్ని, ఉప్పర్‌పల్లి ప్రాథమిక పాఠశాలల వద్ద అభివృద్ధి పరిచిన మౌలిక వసతులను మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా పాఠశాలల వద్ద నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాల నిర్లక్షం కారణంగా ప్రభుత్వ బడుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, ఉపాధ్యాయులు లేక విద్యా వ్యవస్థ కుంటుపడే పరిస్థితిని కళ్లారా చూశామన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యారంగ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు.

అందుకే మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువచ్చామన్నారు. ఆధునిక హంగులతో నూతన పాఠశాల భవన సముదాయాలు ఆహ్లాదకరంగా ఉన్నాయన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత నిర్భంద విద్య, ఏకరూప దుస్తులను ప్రభుత్వం సమకూర్చిందన్నారు. అనంతరం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన రాగి జావాను ఆయన విద్యార్థులకు అందజేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీధర్, ఎంపిపి వనజమ్మ, విద్యా శాఖ సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, ఎంఈఓ వెంకటయ్య, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, ఎంపిటిసి రంగప్ప, ఎస్‌ఎంసి ఛైర్మన్ ఎన్.అంజనేయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News