Wednesday, January 22, 2025

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయస్థాయిలో ఎనర్జీ ఎఫిషీయెంట్ ప్లాంట్ అవార్డు

- Advertisement -
- Advertisement -

గోవాలో అవార్డును స్వీకరించిన చీఫ్ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్ ఎన్.వి.కె. విశ్వనాథ రాజు
అభినందనలు తెలిపిన సిఎండి శ్రీధర్

మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరో ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకుంది. గోవాలో జరుగుతున్న మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ రెండు రోజుల సదస్సులో భాగంగా మంగళవారం నిర్వాహకులు 2021-,22 సంవత్సరానికి గాను దక్షిణ భారత స్థాయిలో బెస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ ప్లాంట్ (కోల్) గా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎంపిక చేస్తూ అవార్డును ప్రదానం చేశారు. దక్షిణ భారత దేశంలో ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుమారు 75కు పైగా ప్లాంట్లలో సింగరేణికి ఈ అవార్డు దక్కడం విశేషం. మంగళవారం గోవాలో నిర్వహించిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవం- 2022 కార్యక్రమంలో సింగరేణి చీఫ్ (ఇ అండ్ ఎం) పవర్ ప్రాజెక్ట్ ఎన్.వి.కె. విశ్వనాథ రాజు, చీఫ్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) జె.ఎన్.సింగ్ ఈ అవార్డును స్వీకరించారు.

అతి తక్కువ ఇంధన వినియోగంతో విద్యుత్‌ను…

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇప్పటికే ఫ్లై యాష్ యుటిలైజేషన్‌లో ఉత్తమ ప్లాంట్ గా ఎంపికై అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పాదనలో అతి తక్కువ నెట్ హీట్ రేటును నమోదు చేస్తున్నందుకు ఈ అవార్డును ప్లాంట్ కైవసం చేసుకుంది. సాధారణ ప్రమాణాల ప్రకారం 500 మెగావాట్ల ప్లాంట్‌లో ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి 2,444 కిలో క్యాలరీస్‌కు లోబడి ఇంధనశక్తి వాడటాన్ని కనీసం ప్రమా ణికంగా భావిస్తారు. కాగా, సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ 2021-,22లో ఈ ప్రమాణాలకు లోబడి 2429 కిలో క్యాలరీస్‌ను నమోదు చేసింది. దీంతో దక్షిణ భారత దేశంలో అత్యంత సమర్థవంతంగా ప్లాంట్‌ను నిర్వహిస్తూ అతి తక్కువ ఇంధన వినియోగంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్ గా రికార్డు సృష్టించింది.

సిఎండి శ్రీధర్ దిశా నిర్ధేశంలో….

సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ సింగరేణి ప్లాంట్ తన ప్రతిభా పాటవాలతో జాతీయ స్థాయిలో అవార్డును అందుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను, ఉద్యోగులను అభినందించారు. ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇకపై కూడా అత్యుత్తమ స్థాయి ప్రతిభ కనబరచాలని ఆయన సూచించారు. డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు మాట్లాడుతూ సిఎండి ఎన్.శ్రీధర్ దిశా నిర్ధేశంలో మొదటి నుంచి ప్లాంట్ నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ ముందుకుపోతోందని అందులో భాగంగానే అనేక అవార్డులు, గుర్తింపు సాధించగలిగిందన్నారు. ఈ సందర్భం గా ఆయన ప్లాంట్ నిర్వాహకులు, సిబ్బందిని అభినందించారు. గోవాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో డిజిఎం (ఇ అండ్ ఎం) వి.వి.సుధాకర్ రెడ్డి, డిజిఎం (ఓ అండ్ ఎం) వీరబ్రహ్మం, డిప్యూటీ ఎస్‌ఈ సముద్రాల శ్రీనివాస్, ఇ.ఇ. విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News