Thursday, December 19, 2024

కరువు నేలలో ధాన్యపు సిరులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా లక్షన్నర మంది రైతులతో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కె. తారక రామారావు సంభాషించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన, రైతన్నల కోసం, వ్యవసాయ రంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అన్నదాతల కోసం పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి ఎప్పటిలాగానే అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైతులతో మాట్లాడిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక వ్యవసాయ కార్యక్రమాల గురించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతన్నల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం వినూత్నమైన కార్యక్రమాలను ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్నారన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని నమ్మే వ్యక్తి కెసిఆర్ అని అన్నారు.

అందుకే దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించేందుకు కూడా సాహసించని రైతుబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారని కెటిఆర్ పేర్కొన్నారు. రైతుబంధుతో అన్నదాతకు ఆత్మబంధువుగా నిలుస్తూ ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుందని కెటిఆర్ తెలిపారు. రైతుబంధుతో ఇప్పటి వరకు 9 విడతల్లో రూ.57,882 కోట్ల రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు. 10వ విడత నిధులు రూ.7,600 కోట్లు ఈ నెలాఖరు నుండి పంపిణీ చేస్తామన్నారు. రైతుబంధు సుమారు 66 లక్షల మంది తెలంగాణ రైతులకు లబ్ది కలుగుతుందన్నారు. అప్పు రూపంలో కాకుండా పెట్టుబడి రూపంలో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్నదాతలకు ఆర్థిక సహాయం చేసిన తొలి ముఖ్యమంత్రి దేశంలో కేవలం కెసిఆర్ ఒక్కరేనని అన్నారు. రైతుబంధు విజయంతో కేంద్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ స్ఫూర్తిగా రైతుబంధు లాంటి పథకాన్ని చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు.
మాది మానవీయ సర్కార్
రైతు బీమాతో రైతన్నలకు ఒక గొప్ప భరోసాను అందించిన మానవీయ సర్కారు తమదని కెటిఆర్ అన్నారు. రైతు ల తరుపున ప్రభుత్వమే బీమా ప్రీమియంను చెల్లించి దు రదృష్టవశాత్తు చనిపోయిన రైతు కుటుంబాలకు ఐదు ల క్షల రూపాయల భరోసాను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్‌దే అని అన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 94వేల రైతు కుటుంబాలకు రూ. 4700 కోట్ల బీమా పరిహారం చెల్లించామన్నారు. తెలంగాణ ఏర్పాటు కు ముందు రైతన్నలు, వ్యవసాయ రంగ పరిస్థితులు ఘో రంగా ఉండేవన్న కెటిఆర్, సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయానికి కెసిఆర్ కాయకల్ప చికిత్స చేశారన్నారు.
రాష్ట్రాన్ని సజీవ సాగునీటి క్షేత్రంగా మార్చాం
సమైక్య రాష్ట్రంలో పెండింగ్‌లో పడ్డ ప్రాజెక్టులన్నింటిని పూర్తిచేసి కాళేశ్వరం లాంటి నూతన ప్రాజెక్టులతో తెలంగాణను ఒక సజీవ సాగునీటి క్షేత్రంగా మార్చిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్ర సాగునీటి రంగ విజయాలతో కెసిఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అన్న తీరుగా అర్థం మారిందన్నారు. ఒకప్పుడు కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా వలసలతో వలపోసిన మహబూబ్ నగర్ జిల్లా ఇవాళ పచ్చగా మారి కెసిఆర్ సంకల్ప సిద్ధికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందన్నారు.
దండగలా ఉన్న వ్యవసాయం పండుగగా మారింది
కెసిఆర్ పట్టుదల, చిత్తశుద్దితో సమైక్య రాష్ట్రంలో దండగలా ఉన్న వ్యవసాయం ప్రస్తుతం రాష్ట్రంలో పండగగా మారిందన్నారు. విద్యుత్, సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడంతో లక్షలాది అదనపు ఎకరాలు సాగులోకి వచ్చి తాగు, సాగునీటికి కొరత లేకుండా కడుపునిండా నీళ్లు దొరుకుతున్నాయన్నారు. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న తిండిగింజల ఉత్పత్తి ఇవాళ రికార్డ్ స్థాయిలో మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. కెసిఆర్ నాయకత్వంలోని రైతు సర్కార్‌కే ఈ ఘనత సాధ్యమైందన్నారు. పండించిన ధాన్యాన్ని కొనమని కేంద్రం మొండికేస్తే…వేలాది కోట్ల రూపాయలతో పండిన ప్రతి గింజను కొన్న రైతుపక్షపాతి ప్రభుత్వం తమదన్నారు.
అన్నపూర్ణగా తెలంగాణ
వ్యవసాయ సంక్షోభాన్ని తట్టుకోలేక పంట పొలాల్లోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఆహారధాన్యాలను పండిస్తూ తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని కెటిఆర్ అన్నారు. సాలీనా పెరుగుతున్న ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనుగుణంగా నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచామన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నాలుగు లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న గోదాముల సామర్థ్యాన్ని 24 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.
24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా
2014కు ముందు కరెంటు కోతలు, దొంగ రాత్రి కరెంటు సరఫరాతో రైతన్నలు బోరు బావుల దగ్గర ప్రాణాలు పోగొట్టుకున్న దుస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదని కెటిఆర్ వెల్లడించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటుతో రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు. నాణ్యమైన కరెంటు ఇవ్వడంతో ఇప్పటి వరకు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి కోతలు ఏర్పడడం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ తో పాటు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ 24 గంటలు వ్యవసాయ విద్యుత్తు ఎక్కడ లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరు గంటల కరెంటుతో అరిగోస పడ్డ రైతన్నకు కెసిఆర్ 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటును అందిస్తున్నారన్నారు. రూ.36,703 కోట్లతో విద్యుత్ రంగంలో మౌలిక వసతులను కల్పించి సాలీనా దాదాపు రూ. 10,500 కోట్ల వ్యయంతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు అందిస్తుందన్నారు.
సంపూర్ణంగా మారిన వ్యవసాయ ముఖచిత్రం
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయిందని కెటిఆర్ అన్నారు. అన్నదాతలను సంఘటితపరిచి,వారిని చైతన్యపరచడానికి ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో క్లస్టర్‌కు ఒక రైతువేదిక లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 572 కోట్లతో 2601 రైతువేదికలను తమ ప్రభుత్వం నిర్మించిందన్నారు. రైతు సంక్షేమం విషయంలో ఇదొక అపూర్వ విజయం అన్నారు.
భవిష్యత్‌లోనూ రైతన్నల ఆశీర్వాదం మాకే
రైతన్నల సమగ్ర సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ రైతాంగం తమకు మద్దతుగా నిలిచిందన్నారు. భవిష్యత్తులోనూ రైతన్నల ఆశీర్వాదం తమకు ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రైతే ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అన్నదాతలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రైతన్నల మద్దతుతో భవిష్యత్తులోనూ వ్యవసాయ రంగాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News