హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యి, మళ్ళీ శిశువుకు జన్మనిచ్చే ప్రతి దశలో అమ్మ వలె, అన్న వలె, మేనమామ వలె అండగా నిలుస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ మహిళా బంధుగా భావిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 6,7,8 తేదీల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతి మహిళా ఇందులో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ లు కోరారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం టిఆర్ఎస్ఎల్ పి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళల కోసం ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని, ఇందులో మహిళలంతా భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర మహిళలందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సాధించాక మహిళల అభివృద్ధికి చేపట్టిన కార్య్రమాలు, వాటి ద్వారా వస్తున్న ఫలితాలు లబ్ధిదారులయిన మహిళలకు చెప్పాలన్నదే తెలంగాణ మహిళా బంధు కార్యక్రమం ఉద్దేశమని ఆమె తెలిపారు. మహిళలు ఆకాశంలో సగం ఉన్నా… గత ప్రభుత్వాలలో అవకాశాల్లో అట్టడుగున ఉన్నారని విమర్శించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక 70 ఏళ్లలో సాధ్యం కానిది సీఎం కేసిఆర్ గారు 7 ఏళ్లలో సుసాధ్యం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 10.27 లక్షల మంది మహిళలకి లబ్ధిచేకూర్చి వారికి, అండగా నిలిచి మేలు చేస్తున్నారని సత్యవతి రాథోడ్ వెల్లడించారు.