కేంద్రం ఈ విషయమై నిర్లక్ష్యం వహిస్తోంది
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన సమ్మక్క సారక్క జాతర జరిగే ప్రాంతాన్ని ఏరియల్ రివ్యూ చేశారు. మేడారం పరిసరాల్లో విహంగ వీక్షణం ద్వారా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ పండుగ విషయమై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవని రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీగా నిధులు సమకూర్చి అన్ని వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
ములుగు జిల్లాలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర అతిపెద్ద గిరిజన జాతర అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు జాతర కోసం దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. మూడు నెలల నుంచి ఈ జాతర కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ జాతరకు సంబంధించి మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారన్నారు. ఎక్కడా ఏ లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, గతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, ప్రస్తుతం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని, అందులో భాగంగా ఇప్పటివరకు భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాలేదన్నారు.