Wednesday, January 22, 2025

బాలికను ఎదగనిద్దాం

- Advertisement -
- Advertisement -

మనిషి జీవితంలో బాల్యం ఎంతో మధురమైనది. స్వేచ్ఛగా జీవించి, ఎదిగే హక్కు, బాలుడితో పాటు బాలికకు ఉంది. కానీ, ఇది ఆచరణలో అమలు కావడం లేదు. తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు మన దేశంలో ఆడబిడ్డ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బాలికల పట్ల కొనసాగుతున్న వివక్షతను తొలగించి , వారి సమగ్రాభివృద్దే లక్ష్యంగా 2009 నుంచి ప్రతి ఏటా జనవరి 24 న జాతీయ బాలిక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇదే రోజు భారత మొదటి మహిళా ప్రధాని ఇందిరగాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చారిత్రక ఘట్టాన్ని మన దేశంలో మహిళా సాధికారతకు చిహ్నంగా చూడడం ఒక ఆనవాయితీగా వస్తుంది.

దేశంలోని బాలిలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, తగిన అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జనవరి 24న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చొరవతో జాతీయ బాలికా దినోత్సవాన్ని పాటిస్తూ వస్తున్నారు. బాలికల హక్కులపై అవగాహన కల్పించడం, బాలికా విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారాలకు ప్రాముఖ్యం ఇవ్వడం కూడా బాలికా దినోత్సవం లక్ష్యాలు. నేటి ఆధునిక యుగంలో బాలికలు అమ్మ గర్భంలో నుంచే వివక్షకు గురవుతున్నారు. మన దేశంలో గుళ్ళో దేవత పూజలు, ఇంట్లో బాలికపై వివక్ష సంస్కృతి తరతరాల నుంచి కొనసాగుతుంది. ఈ సమస్య ఇలాగే కొనసాగితే ఎన్నో విపరీత పరిణామాలకు, సాంఘిక ఉత్పాతాలకు దారి తీస్తుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మగపిల్లవాడు వంశోద్ధారకుడనే సామాజిక అపోహల వల్ల మగపిల్లలకు ప్రాధాన్యత పెరిగి లింగ నిష్పత్తి గాడి తప్పుతుంది.

2001 జనాభా లెక్కలు ప్రకారం జాతీయ స్థాయిలో బాలబాలికల లింగ నిష్పత్తి 1000: 927 కాగా… అది 2011 నాటికి 1000:914 పడిపోయింది. ఈ విషయంపై సామాజిక అవగాహన పెంచి పీడన నుంచి బాలికలకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కడం లేదు. లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు చాప కింద నీరులా కొనసాగుతున్నాయి. తద్వారా జన్మనిచ్చే మహిలే జన్మ హక్కును కోల్పోవడం జరుగుతుంది. పేదరికం, నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, అక్రమ రవాణా బాలిక సాధికారతకి గొడ్డలుపెట్టుగా మారాయి. నేడు బాలికల రక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారుంది. అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు బలవుతున్నారు. ఇటీవల చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పాక్సో) కింద కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.

పలువురు భారతీయ మహిళలు ప్రపంచ నాయకులుగా విభిన్న రంగాలలో శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ దేశంలోని చాలా మంది మహిళలు, బాలికలు లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య అభిప్రాయాలు, నిబంధనలు, సంప్రదాయాల నుంచి విముక్తి కాలేకపోతున్నారని యునెస్కో స్పష్టం చేసింది. తద్వారా తమ హక్కులను పూర్తిగా అనుభవించలేకపోతున్నారని పేర్కొన్నది. బాలబాలికల సాధికారతకు సమానంగా మద్దతు ఇస్తే తప్ప భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బాలికల హక్కులను కాపాడటంలో మొదట బాలికా విద్యను ప్రోత్సహించాలి. ఇది సమాజంలో అసమానతలను తగ్గిస్తుంది. దీనికై జాతీయ విద్యా విధానం- 2020లో బాలిక అభివృద్ధికి లింగ సమ్మిళిత నిధి(Gender inclusive fund)ని ప్రవేశపెట్టింది.

ఇది నాణ్యమైన, సమానత్వంతో కూడిన విద్యను అందించడంలో ఎంతో తోడ్పడుతుంది. బాలికా సంక్షేమం నిధులతో ముడిపడి ఉంది. ఇప్పటివరకు వారికోసం పలు పథకాలు ప్రవేశ పెట్టినప్పటికి అమలుకు నిధులు సమస్య వెంటాడుతుంది. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలిక అభివృద్ధి పట్ల ప్రత్యేక చొరవ చూపాలి. బేటీ బచావో- బేటి పడావో ప్రభుత్వ నినాదమే కాదు మన అందరి నినాదం కావాలి. పౌర సంస్థలు, ప్రభుత్వం వారి హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. తల్లిదండ్రులు ఆడపిల్లలను సంస్కృతి, సంప్రదాయాల పరిధిలో బంధించి వారి సాధికారతను దెబ్బ తీయవద్దు. అబ్బాయిలతో సమానంగా విద్యావకాశాలను కల్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలి. అప్పుడే ఆడపిల్లల పట్ల వివక్ష తొలిగిపోయి రాజ్యాంగం సూచించిన లింగ సమానత్వం సాధ్యమవుతుంది.

దేశంలోనే మొదటిసారి బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలు బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేశాయి. వారి ఎదుగుదలకు దోహదపడ్డాయి. తల్లిదండ్రులకు ఆడపిల్లలంటే భారం కాదని, వారి పట్ల సానుకూల దృక్పథం కనబరిచేలా ఈ పథకం ఉపకరించింది. అంతేకాకుండా బాలిక విద్య కోసం ప్రత్యేక గురుకులాలను సైతం ఏర్పాటుచేశారు. తద్వారా అనేక మంది బాలికలు ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత చదువులు చదివి రాణిస్తున్నారు. నేడు తక్షణమే బాలికలు, స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలి. బాలికలకు సమాజంలో రక్షణ ఉందనే నమ్మకాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వం, పౌర సమాజం తీసుకోవాలి. అందుకే ఆడపిల్లని బతకనిద్దాం, చదవనిద్దాం. ఎదగనిద్దాం అనే నినాదంతో ముందుకెళ్లాలి.

సంపతి రమేష్ మహారాజ్
7989579428

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News