Thursday, November 14, 2024

నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీకి మళ్లీ ఈడీ సమన్లు ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మళ్లీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఆమధ్య వీరిద్దరినీ ఈడీ అధికారులు కొన్ని రోజులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత చేపట్టిన దర్యాప్తులో కాంగ్రెస్‌కు చెందిన యంగ్ ఇండియా సంస్థకు కొన్ని అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. షెల్ కంపెనీల ద్వారా యంగ్ ఇండియా కంపెనీకి రూ. 45 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. వీటి గురించి ఇప్పటికే ఈడీ అధికారులు ఆ షెల్ కంపెనీల యజమానుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దీనిపై ప్రశ్నించేందుకు సోనియా, రాహుల్‌కు త్వరలోనే సమన్లు జారీ చేయాలని ఈడీ అధికారులు యోచిస్తున్నట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి. వీరితోపాటు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత బన్సల్ తదితరులకు ఈ సమన్లు అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యంగ్ ఇండియా కంపెనీలో రాహుల్, సోనియా గాంధీకి మెజార్టీ వాటాలు న్నాయి.

ఇదీ అసలు వివాదం…

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది జూన్‌లో ఈడీ అధికారులు రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సోనియా గాంధీ కూడా మూడు రోజులు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమం లోనే యంగ్ ఇండియా కార్యాలయం లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించేందుకు 1938 లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) సంస్థ ఆధ్వర్యంలో పత్రిక నిర్వహణ కొనసాగింది. అయితే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని సోనియా, రాహుల్ ఆయాచితంగా పొందారంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి గతం లోనే ఫిర్యాదు చేయగా, దీనిపై కేసు నమోదైంది. కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. దీనిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News