Wednesday, January 22, 2025

వచ్చే నెలలో జాతీయ రహదారుల పనులు మొదలు

- Advertisement -
- Advertisement -

National highways work will start next month

రహదారుల విస్తరణకు పూర్తయిన టెండర్‌లు!
రూ.6,212.9 కోట్లతో 16 రహదారులు…
రెండు వరుసలు, నాలుగు లేన్లుగా అభివృద్ధి….

హైదరాబాద్: రాష్ట్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి టెండర్‌ల ప్రక్రియ పూర్తి కావడంతో వచ్చే నెలలో పనులు ప్రారంభం కానున్నాయి. సుమారు 16 జాతీయ రహదారులకు సంబంధించి రోడ్ల విస్తరణ (రెండు వరుసలు, నాలుగు లేన్లు)గా అభివృద్ధి చేయనున్నారు. దీనికి సుమారు కేంద్రం రూ.6,212.9 కోట్ల నిధులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళికను ఖరారు చేసిన కేంద్రం ఇందులో అధికంగా పలు రాష్ట్రాలకు నిధులను మంజూరు చేయగా అందులో ఎపికి రూ.7.899 కోట్లు, ఉత్తరప్రదేశ్ కు రూ.7,530 కోట్లు తెలంగాణకు రూ.6,212.9 కోట్లను కేటాయించింది. 8 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న రోడ్లకు కేంద్రం భారీగా నిధులు కేటాయించటం ఇదే తొలిసారని అధికారులు పేర్కొంటున్నారు.

రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా గుర్తింపు
ఫిబ్రవరిలో నిధుల కేటాయింపునకు సంబంధించి సెంట్రల్ ఫైనాన్స్ కమిటీ, ఆర్థిక వ్యవహారాల విభాగాలు ఆమోదముద్ర వేయడంతో ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించి 16 రోడ్ల పనులకు మోక్షం లభించింది. రాష్ట్ర రహదారులుగా ఉన్న వీటిని జాతీయ రహదారులుగా గుర్తిస్తూ కేంద్ర రహదారుల శాఖ అనుమతివ్వడంతో జాతీయ రహదారుల విభాగం డిపిఆర్‌లను సిద్ధం చేసింది. ఆ డీపీఆర్‌లను సెంట్రల్ ఫైనాన్స్ కమిటీకి సమర్పించగా వాటిని పరిశీలించి నిధుల విడుదల తాజాగా ఆమోద ముద్ర వేసింది. 2 వరుసలు, 4 వరుసలకు రోడ్ల విస్తరణతో పాటు రోడ్లను పటిష్టపరిచేందుకు నిధుల విడుదలకు కమిటీ అనుమతిచ్చింది. దీంతో ఈ మధ్యనే అధికారులు టెండర్లు పిలిచారు. వచ్చే రెండేళ్లలో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పేర్కొంటున్నారు.

రెండు వరుసలుగా విస్తరించే రోడ్లు….

సిరోంచ టు మహదేవ్‌పూర్ (ఎన్‌హెచ్ 353సి) 17 కి.మీలు, రూ.163.42 కోట్లు, దుద్దోడ టు జనగామ (ఎన్‌హెచ్365బి) 46.3 కి.మీలు రూ.423.48 కోట్లు, నిజాంపేట టు నారాయణఖేడ్ టు బీదర్ (ఎన్‌హెచ్ 161బి) 45 కి.మీలు రూ.512.98 కి.మీలు, మహారాష్ట్ర సరిహద్దు టు బోధన్ (ఎన్‌హెచ్ 63) 8.2 కి.మీలు, రూ.47.68 కోట్లు, సిద్ధిపేట టు ఎల్కతుర్తి (ఎన్‌హెచ్ 765డిజి) 67.6 కి.మీ.లు, రూ.882.18 కోట్లు, మెదక్ టు సిద్ధిపేట (ఎన్‌హెచ్ 765 డిజి) 70 కి.మీలు, రూ.578.85 కోట్లు, వలిగొండ టు తొర్రూరు (ఎన్‌హెచ్ 930సి) 68 కి.మీలు, రూ.549.28 కోట్లు, బోధన్ టు బాసర టు భైంసా (ఎన్‌హెచ్ 161బిబి) 56.5 కి.మీలు, రూ.644.45 కోట్లు, మహబూబ్‌నగర్ టు చించొలి సెక్షన్ (ఎన్‌హెచ్ 167 ఎన్), 57 కి.మీలు, రూ.703.68 కోట్లు, కల్వకుర్తి టు సోమశిల (ఎన్‌హెచ్ 167 కె) 85 కి.మీలు, రూ.886 కోట్లు,

నాలుగు వరుసలుగా విస్తరించే రోడ్లు….

మహబూబ్‌నగర్ టు చించొలి సెక్షన్ (57 కి.మీల నుంచి 96 కి.మీల వరకు) (ఎన్‌హెచ్ 167 ఎన్) మొత్తం 39 కి.మీలు, రూ.631.49 కోట్లు, నిజామాబాద్ టు జగ్జల్‌పూర్ మధ్య 4/4 కి.మీ దగ్గర నాలుగు వరుసల వంతెన విస్తరణ, 0.6 కి.మీలు, రూ.20.59 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల వరకు 167కె జాతీయ రహదారిని విస్తరించనున్నారు.ఈ రోడ్డును రెండు వరుసలుగా విస్తరించే క్రమంలో సోమశిల వద్ద కృష్ణానదిపై దాదాపు 2 కిలోమీటర్ల నిడివిగల వంతెనను నిర్మించాల్సి ఉంది.ఇది పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకులను ఆకట్టుకునేలా తీగల జాతీయ (సస్పెన్షన్ బ్రిడ్జి) వంతెనను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. శ్రీశైలం రిజర్వాయర్ పరిధిలోకి ఇది వస్తుండడంతో అక్కడ కృష్ణానది లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో నదీగర్భంలో పునాదులు తీసి వంతెన కట్టడం కంటే తీగల నమూనా మంచిదని ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖర్చు పెరిగినా సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణమే ఉత్తమమని అధికారులు తేల్చారు. దీనికోసం దాదాపు రూ.750 కోట్లు ఖర్చవుతుందని డిపిఆర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి బ్రిడ్జి నమూనా సిద్ధం చేయాల్సి ఉంది. అయితే వంతెనతో కలుపుకుంటే నిర్మాణ వ్యయం రూ.1,600 కోట్లు అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News