మన తెలంగాణ/హైదరాబాద్: ఒడిశా వేదికగా జరుగుతున్న జాతీయ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ సంచలనం వ్రితి అగర్వాల్ రెండో స్వర్ణం సాధించింది. భువనేశ్వర్‌లోని కళింగా స్టేడియంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన బాలికల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రితి అగర్వాల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. అసాధారణ ఆటను కనబరిచిన వ్రితి 9:20:25 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకాన్ని దక్కించుకుంది. కర్నాటక స్విమ్మర్ అదితి రెండో స్థానంలో నిలిచి రజతాన్ని, తిక్షిత రావత్ (ఢిల్లీ) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
ఇక 400 మీటర్లు వ్యక్తిగత మెడ్లే విభాగంలో తెలంగాణ స్విమ్మర్ నిత్యా సాగి రజతం గెలుచుకుంది. కర్నాటకకు చెందిన తాన్య స్వర్ణం సాధించింది. ఇదిలావుంటే వ్రితి అగర్వాల్ బాలికల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కూడా పసిడి పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే.