భద్రాద్రి కొత్తగూడెం : దేశంలోనే ఉత్తమ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామపంచాయతీ నిలిచింది. వర్షపు నీటిని వృథాగా పోకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే రీతిలో భూగర్భ జలాలను పెంపొందించడంలో ఈ పంచాయతీ విశేష కృషి సల్పడం పట్ల కేంద్ర జలశక్తి శాఖ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కల్పించింది. ప్రతీ ఏట కేంద్ర జలవనరుల శాఖ ఈ అవార్డులను ఎంపిక చేస్తుంది.
ఈ పంచాయతీలో చిన్న చిన్న వాగులు, వంకలు తప్ప వర్షపు నీటిని నిలువ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో జిల్లా కలెక్టర్ అనుదీప్ కృషితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ వాటర్‌షెడ్, మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేశాయి. ప్రభుత్వ నిధులతో గత ఏడాది భూగర్భ జలాలను పెపొందించే ఉద్దేశ్యంతో చెరువులు, కుంటల వద్ద వాటర్ షెడ్ పథకాలను అమలులోకి తీసుకువచ్చారు.
సర్పంచ్ గడ్డం భవాని పనులు జరుగుతున్న ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు శాసనసభ్యుడు, కలెక్టర్ల ద్వారా సలహాలు, సూచనలు తీసుకుంటూ సమర్థవంతంగా నిర్మాణాలు పూర్తి చేశారు. తద్వారా ప్రభుత్వ లక్షం నెరవేరడంతో పాటు జాతీయ స్థాయి అవార్డు సాధించడం పట్ల వారి శ్రమకు తగిన ఫలితం లభించినట్లైంది. దీంతో కలెక్టర్ ఈ మండలంలో ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, నీటి వినియోగం,నిల్వ సామర్థం, ప్లాస్టిక్ వినియోగం పట్ల అనర్థాలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై కళాజాత బృందంతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నెల 17న ఢిల్లీలో ఈ పంచాయతీకి అవార్డు ప్రదానం చేయనున్నారు. మారుమూల గ్రామానికి ఈ అత్యుత్తమ పురస్కారం లభించడం పట్ల జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.