కరోనాపై జాతీయ స్థాయి యుద్ధంలో సర్వ సైన్యాధ్యక్ష బాధ్యత వహించి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్, బాధితులందరికీ ఆక్సిజన్ తదితర అత్యవసర మందులు లోటు లేకుండా అందేలా చూడడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం రోజురోజుకీ మరింతగా కనిపిస్తున్నది. ఇతర దేశాలతో యుద్ధాలలో పోరాడడానికి సుశిక్షత సైన్యం ఉంటుంది. మొత్తం జాతి ఆరోగ్య కవచానికి తూట్లు పొడుస్తూ అన్ని వయసుల వారి ప్రాణాలను బలి తీసుకుంటున్న మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశ ప్రజలను కాపాడడానికి ఎటువంటి సైన్యాన్ని, సామగ్రిని ఏ స్థాయిలో, ఏ విధంగా, ఎంత పకడ్బందీగా సమీకరించి శత్రువుపై సంధించాలి? ఆ బాధ్యత దేశాన్ని నడుపుతున్న కేంద్ర పాలకులది కాదా? పిఎం కేర్స్ వంటి ఆప్తకాల నిధులు సమకూర్చుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ గురుతర బాధ్యత నుంచి తప్పుకోడం సబబేనా? టీకా మందుల ధరల నిర్ణయంలో వ్యాక్సిన్ కంపెనీలకు ఇష్టావిలాస స్వేచ్ఛ ఇచ్చేసి రాష్ట్రాలు వాటి నుంచి కొనుగోలు చేసుకోవాలని చెప్పడం ధర్మమేనా?
18 ఏళ్ల పైబడిన మహా జనానికి టీకా పంపిణీ బాధ్యతను ఆ విధంగా రాష్ట్రాల నెత్తిన పడవేయడం కేంద్రానికి తగునా అనే ప్రశ్నలు నేడు దేశ ప్రజల నుంచి వినవస్తున్నాయి. సామాజిక మాధ్యమాలలో దుమ్మురేపుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపించి తీవ్రంగా బాధిస్తుందని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. దానిని పెడచెవిని పెట్టి ప్రజలను లక్షల సంఖ్యలో ఒక్క చోటికి తరిమి తరలించి పాలకులు తామే కొవిడ్ వ్యాప్తికి దోహదపడడం సమంజసమేనా అనే ప్రశ్న నిలువెత్తున లేచింది. ఈ విధమైన నిర్వాకంతో ఇంత కాలం వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచార సభల్లో తలమునకలైన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ అమాత్యులు అమిత్ షా దాని దుష్ట పర్యవసానాలను ఇప్పుడు కళ్లారా చూస్తున్నారు. కోరి అంటించిన కొరివిని ఆర్పడంలో వారు వహిస్తున్న నిర్లక్షాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ఎత్తి చూపవలసి వచ్చింది.
ఈ విపత్కాలంలో ఆక్సిజన్, అత్యవసర మందులు సవ్యంగా అందరికీ సమానంగా పంపిణీ అయ్యేట్టు చూడడానికి కేంద్రం తగిన జాతీయ ప్రణాళికను అమలు చేస్తుందని ఎదురు చూశాం అంటూ సుప్రీంకోర్టు గురువారం నాడు మొట్టికాయలు వేసింది. ప్రతిపక్ష నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కేంద్రం వైఖరిపై ఆగ్రహిస్తున్నారు. కరోనా టీకా మందును మూడు రకాల ధరలకు విక్రయించడానికి అనుమతించడం పట్ల విమర్శ వెల్లువెత్తుతున్నది. కంపెనీలు తాము ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌లో సగ భాగాన్ని తక్కువ రేటుకు కేంద్రానికి ఇస్తూ మిగతా సగాన్ని ఇష్టం వచ్చిన ధరకు రాష్ట్రాలకు, ప్రైవేటు రంగానికి అమ్ముకోడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం అవకాశమిచ్చింది. ఆ విధంగా దేశంలోని పేద ప్రజల అవసరాన్ని అవి మితి మించి సొమ్ము చేసుకోడానికి వీలు కల్పించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దీనిని గురువారం నాడు తీవ్రంగా దుయ్యబట్టారు. 1845 ఏళ్ల వారందరికీ ఉచిత టీకా ఇవ్వవలసిన బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకున్నదని ఆమె అన్నారు.
కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ ఒక్కొక్క డోసును కేంద్రానికి రూ. 150కి, రాష్ట్రాలకు రూ. 400కి, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600కి అమ్మనున్నట్టు ప్రకటించింది. ప్రాణాంతక స్థితిలోని కొవిడ్ రోగుల ఊపిరి నిలబెట్టే ఆక్సిజన్‌కు ఏర్పడిన కొరత ఆ రోగుల ప్రాణాలను తోడేస్తున్నది. మహారాష్ట్రలోని నాసిక్‌లో గల జాకీర్ హుస్సేన్ మునిసిపల్ ఆసుపత్రి వద్ద నెలకొల్పిన ట్యాంకర్ లీకై వెంటిలేటర్ మీదున్న 24 మంది కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందకపోడంతో వారు దుర్మరణం పాలైన దారుణోదంతం తర్వాత దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ సంక్షోభం వెలుగులోకి వచ్చింది. హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి తాము కొనుక్కొని తెచ్చుకుంటున్న ఆక్సిజన్ సరఫరాలను ఆ రాష్ట్రాల బిజెపి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నదని తెలంగాణ వైద్య ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. 4 లక్షల వయల్స్ రెమ్‌డిసివిర్‌ను తెలంగాణ కోరగా పది రోజులకు సరిపడేటట్టు కేవలం 21,551 వయల్స్‌ను మాత్రమే దయతలచిందని ఆయన అన్నారు.
అదే సమయంలో గుజరాత్‌కు 1.63 లక్షల వయల్స్‌ను ఇచ్చిందని ఎత్తి చూపారు. కేంద్రం చెప్పిన ‘ఒకే జాతి ఒకే పన్ను విధానానికి తాము అంగీకరించామని అందుకు విరుద్ధంగా అది వ్యాక్సిన్‌కు రెండు ధరల పద్ధతిని ప్రవేశపెట్టిందని, పిఎం కేర్స్ నుంచి నిధులు తీసి కేంద్రమే వ్యాక్సిన్ ఖర్చును భరించవచ్చునని తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. 2020 మార్చి 27న నెలకొన్న పిఎం కేర్స్ నిధికి ఆ ఏడాది మే నాటికే రూ. 10,600 కోట్లు జమ అయినట్టు సమాచారం. ఇంత డబ్బు చేతిలో ఉంచుకొని ఈ ప్రళయ సమయంలో దేశ ప్రజలందరినీ సమానంగా ఆదుకొనే బాధ్యత నుంచి కేంద్రం ఇంత బాహాటంగా తప్పుకోడం ఆందోళనకరం, హాస్యాస్పదం.