రూపొందించాలి: ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ
సిఎంలు, వ్యవసాయ నిపుణులతో
సమావేశం ఏర్పాటు చేయాలి
దేశ ఆర్థిక రంగానికి వ్యవసాయమే
ప్రధాన వనరు సేవా
రంగాలకు పంటలే ఆధారం
పంజాబ్, హర్యానాలో పండే
మొత్తం గోధుమలు, వరి
సేకరిస్తున్న కేంద్రం తెలంగాణ
వంటి రాష్ట్రాల్లో ఆ విధానాలను
అమలు చేయడం లేదు వివిధ
రాష్ట్రాలకు వివిధ రీతుల్లో కేంద్ర
విధానాలు ఉండడం సబబు కాదు
తెలంగాణ వరిని మొత్తం
సేకరించకపోతే రైతులు
నష్టపోతారు వ్యవసాయ
రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది
మనతెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం సేకరణపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వ్యవసాయరంగానికి చెందిన నిపుణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దేశ ప్రధాని నరేంద్రమోడిని కోరారు. ధాన్యం సేకరణపై జాతీయ స్థాయిలో దేశమంతటా ఒకే విధానం అవసరం అని తెలిపారు. అన్ని రకాల ఆహార ధాన్యాల సేకరణకు దేశమంతటా ఒకే విధానం ఉండాలని కోరారు. జాతీయ ఆహార ధాన్యాల సేకరణకోసం ప్రత్యేక చట్టం ఉండాలన్నారు. అందుకే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను , వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులను సమావేశ పరిచి ధాన్యం సేకరణ విధానాలపై చర్చించి రైతులకు ఉపయోగపడేలా మెరుగైన రీతిలో జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానాలను రూపొందించాల్సిన అసరం ఉందని తెలిపారు. ధాన్యంసేకరణకు సంబంధించి సిఎం కేసిఆర్ ప్రధాని మోడికి బుధవారం నాడు లేఖ రాశారు. లేఖలో పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకుపోయారు.దేశంలో సగానికిపైగా జనాభాకు వ్యవసాయమే ప్రధాన కులవృత్తి అని వివరించారు.
పంటలసాగే వారికి ప్రధాన జీవనాధారం అని తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రలకు , వివిధ సేవారంగాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులే ప్రధాన వనరులు అని వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులపైనే దేశ ఆర్దిక రంగం అధారపడి ఉందన్నారు. రైతు అనూకూల విధానాల అమలు ద్వారా దేశంలో వ్యవసాయ రంగం సుస్థిరమైన అభివృద్ధి సాధించేవిధంగా కృషి జరగాలన్నారు. అలా జరగనపుడు ఆది దేశ ఆర్ధికరంగంపై ప్యతిరేక ప్రభావం చూపుందని సూచించారు. కనీస మద్దతు ధరలతో పంటల విక్రయాలకు వ్యవసాయ మార్కెట్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి బాధ్యత రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలపైన ఉందన్నారు. ధాన్యం సేకరణలో జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండాలన్నారు. పంజాబ్ , హర్యాణా లాంటి రాష్ట్రాల్లో పండే మొత్తం గోధుమలు , వరిధాన్యం సేకరిస్తున్న కేంద్రం తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అటు వంటి విధానాలను అమలు చేయడం లేదని ప్రధాని దృష్టికి తీసుకుపోయారు.
వివిధ రాష్ట్రాలకు వివిధ రకాలుగా కేంద్రం విధానాలు ఉండటం సబబు కాదని ప్రధానికి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని సేకరించకపోతే రైతులు నష్టపోతారని , ఈ ప్రభావం వ్యవసాయరంగంపైన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. అంతే కాకుండా జాతీయ ఆహారభద్రత లక్ష్యానికి కూడా తీవ్రమైన విఘాతం కలుగుతుందని తెలిపారు.వ్యవసాయరంగంలో కేంద్రప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న కనీసమద్దతు ధరలకు అర్దమే ఉండదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంటల వైవిద్యీకరణను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందుకోసం పలు వ్యవసాయ అనుకూల విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పత్తిసాగును ప్రోత్సహిస్తున్నామని, ఆయిల్ పామ్ , కంది వంటి పంటలసాగును ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. గత 2021రబీ సీజన్ కింద రాష్ట్రంలో 52లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా, ఈ ఏడాది రబీలో పంటల వైవిద్యీకరణ ప్రోత్సాహం ద్వారా వరిసాగును 36లక్షల ఎకరాల విస్తీర్ణానికి తగ్గించగలిగామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల విధానాలు అమలు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలతోపాటు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ,ఉపాధి వలసలు బాగా తగ్గాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం రాష్ట్ర ప్రజల అవసరాలు పోను మిగిలే మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కేంద్రం ఈ విధానాలకు అనుసరించకుండా రైతులను ఇబ్బందులు పెడుతోందని తెలిపారు.ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వెంటనే అన్ని రాష్ట్రాల సిఎంలతో వ్యవసాయ రంగ నిపుణులతో జాతీయ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసిఅన్ని అంశాలు చర్చిచి మెరుగైన విధానాలు రూపొంచాలని సిఎం కేసిఆర్ లేఖ ద్వారా ప్రధాని మోడిని కోరారు.