ఇప్పటి వరకు అమెరికాలోనే అత్యధికంగా ఒక రోజులో కొత్త కేసులు నమోదైన రికార్డు ఉంది. దాన్ని పక్కకు నెట్టి 3,14,835 కేసులతో మనం కొత్త రికార్డు నెలకొల్పాము. దీంతో మన ప్రధాని మోడీ గురించి మరోసారి ప్రపంచం దృష్టి సారించింది. ప్రాణ వాయువు, ప్రాణావసర ఔషధాలు, టీకాల మీద కేంద్రానికి ఒక జాతీయ విధానం ఉందా అని గురువారం నాడు సుప్రీంకోర్టు తనకు తాను కల్పించుకొని ప్రశ్నించాల్సి వచ్చింది. ఈ మేరకు కేంద్రానికి ఒక నోటీసు కూడా ఇచ్చింది. ఇది ఒక రకంగా అభిశంసన తప్ప మరొకటి కాదు. కేంద్రం ఏం చెబుతుందన్నది పెద్ద విషయం కాదు, ఇప్పటి వరకు జనానికి చెప్పిన కబుర్లు కాకుండా ఉన్నత న్యాయస్థానానికి కొత్త విషయాలేమైనా వినిపిస్తారేమో చూద్దాం. మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ విలేకర్లతో చెప్పారు. అమెరికా కూడా అదే ప్రకటన చేసింది. సాయం తీసుకొనేందుకు కూడా ఒక పథకం ఉండాలి.
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో కూడా మహాత్ములే అధికారంలో ఉన్నారు. మహాత్ములు కదా చిత్రాలు జరుగుతాయి, ఎన్నో చేస్తారు. అవి సామాన్యుల కంటికి కొన్ని ఘోరంగా ఉన్నా అలా రాసి పెట్టి ఉండబట్టే జరుగుతుందనుకోవాలి మరి. ఒక రోజులో అత్యధిక కరోనా కేసులు నమోదై మన దేశం అమెరికా రికార్డును బద్దలుకొట్టింది. అయినా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితి గురించి ఆలోచించటం లేదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మహాత్ములు కనుక ఎక్కడో ఆలోచిస్తున్నట్లున్నారు, ఇంకా ఎంత మందిని బలిపెడతారో అన్న ఆందోళన కలుగుతోంది. ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఏమీ పట్టటం లేదు. కొంత మంది మూఢ నమ్మకం లేదా మూర్ఖత్వానికి జనం బలి అవుతున్నారు. కుంభమేళాలో లక్షలాది మందిని అనుమతించిన కారణంగా ఉత్తరాఖండ్‌లో గురువారం నాడు నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ర్ట వ్యాప్తతంగా ప్రభుత్వ కార్యాలయాలను శుద్ధి చేసేందుకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
కేంద్రం తీసుకున్న చర్యలు, విధానం గురించి తమకు సహాయం చేసేందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను సుప్రీంకోర్టు నియమించింది. ఆక్సిజన్ ప్రాణావసర ఔషధాల సరఫరా, వ్యాక్సిన్ విధానం పద్ధతి, లాక్‌డౌన్లను విధించే అధికారం గురించి వివరించాలని కేంద్రానికి కోర్టు నోటీసు ఇచ్చింది. శుక్రవారం నాడు విచారణ జరపనుంది. ఆరు హైకోర్టులు కరోనాకు సంబంధించి విచారణ జరుపుతున్నాయని మంచి కోసం వాటి పరిధిలో వ్యవహరించటాన్ని తాము అభినందిస్తున్నామని అయితే గందరగోళం తలెత్తటం వనరులు పక్కదారి పడుతున్నందున వాటి గురించి కూడా విచారించాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఈ విధంగా జోక్యం చేసుకొనేందుకు ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రోద్బలం చేశాయని భావించవచ్చు. “ఇక్కడేమీ మానవత్వం మిగిలి ఉన్నట్లు లేదు.
అడుక్కుంటారో, అప్పు తెస్తారో, అపహరిస్తారో మాకనవసరం జనాలకు ఆక్సిజన్ సరఫరా చేయాలి” కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన ఢిల్లీ హైకోర్టు. ఆసుపత్రులకు కొరత లేకుండా ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటూ ప్రభుత్వ తీరు పట్ల న్యాయమూర్తులు మండిపడ్డారు. కొన్ని గంటల్లో అత్యవసరంగా ఆక్సిజన్ అందించకపోతే వందలాది మంది రోగుల పరిస్థితి ఏమౌతుందో తెలియని స్ధితి ఇప్పుడు ఢిల్లీలో ఉంది. అనేక రాష్ట్రాల్లో కూడా అదే స్ధితి. పెట్రోలియం, ఉక్కు పరిశ్రమల నుంచి ఆక్సిజన్ వాయువును వైద్య అవసరాలకు ఎందుకు మళ్లించరు అని హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దిగువ పేర్కొన్న కొన్ని ఉదంతాలు, వార్తలు కూడా సుప్రీంకోర్టును జోక్యానికి పురికొల్పి ఉండవచ్చు.
ఢిల్లీ నుంచి తమ రాష్ర్టంలోని ఫరీదాబాద్‌కు వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం లూటీ చేసిందని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. దాంతో ఆక్సిజన్ వాహనాలకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించామన్నారు. హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. అక్కడి నుంచి తమకు రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్లను ఆయా రాష్ట్రాల అధికారులు, పోలీసులు రానివ్వటం లేదు అని ఢిల్లీ రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విమర్శించారు. వారికి ఢిల్లీతో పంచాయతీ ఏమైనా ఉంటే తేల్చుకోవచ్చు, ఇది సమయం కాదు అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రిక ఆక్సిజన్ సిలిండర్ల వాహనం రాగానే అప్పటికే కాచుకొని ఉన్న కరోనా రోగుల బంధువులు వాటిని లూటీ చేశారని తనకు సమాచారం అందిందని దమో జిల్లా కలెక్టర్ తరుణ్ రతి చెప్పారు.
ఆ జిల్లాలోని ఒక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారం కోసం కరోనా పుచ్చిపోతున్నా మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి, స్వయంగా వైద్యుడై ఉండి కూడా నెల రోజుల పాటు ఏ ఒక్క సమావేశానికీ రాలేదు. తీరికగా ఏప్రిల్ 15న భోపాల్ వచ్చి కర్ఫ్యూను ఉల్లంఘించి అంబేద్కర్‌కు నివాళి అర్పించి 15వ తేదీన విలేకర్ల సమావేశంలో ఇబ్బందికర పరిస్ధితిని ఎదుర్కొన్నారు. జవాబుదారీతనంలో తమకు మించిన వారెవరూ లేరని నరేంద్ర మోడీ చెప్పుకుంటారు. ఆయన మాత్రం తక్కువ తిన్నారా, ఎన్నికల ప్రచారం మీద పెట్టిన శ్రద్ధ్దలో వెయ్యోవంతు ఆక్సిజన్ మీద పెట్టి ఉంటే ఈ పరిస్ధితి తలెత్తి ఉండేదా? దేశంలో వైద్య అవసరాలకు ఆక్సిజన్ సరిపడా ఉంది, సమస్య దాన్ని సరఫరా చేసేందుకు అవసరమైన వాహనాలు లేవని ముంబైకి చెందిన ఒక పెద్ద కంపెనీ ప్రతినిధి చెప్పినట్లు ఒక పత్రిక వార్త.
దేశంలో ఆక్సిజన్ కొరత ఉందని గతేడాది సెప్టెంబరు నెలలోనే కేంద్రానికి తెలుసు. నివారణకు ఐదు అంశాల ప్రణాళికను రూపొందించామని నాటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రకటించారు. గత నెల రోజుల్లోనే రోజుకు 26 వేల కేసుల నుంచి మూడు లక్షల 15 వేలకు పెరిగాయి. ఇల్లు తగులబడుతుంటే బావి తవ్వకం ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు గురించి హడావుడి చేస్తున్నది. నూట అరవై రెండు జిల్లా కేంద్ర ఆసుపత్రులలో వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే ఏప్రిల్ 19 నాటికి పదకొండు ప్లాంట్ల నిర్మాణాలు పూర్తయితే కేవలం ఐదు మాత్రమే ఉత్పత్తిలోకి వచ్చాయని ఒక వార్త, కాదు 33 ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. ఏదైనా మొత్తమైతే ఏర్పాటు చేయలేదు కదా! వీటి కోసం ఏడు నెలలుగా టెండర్లు పిలుస్తూనే ఉన్నారు.
డబ్బుకేమైనా కొరత ఉందా? పిఎం కేర్స్ పేరుతో విరాళం ఇమ్మని కేంద్రం పట్టుకుంటే ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలిసిందే. ఆ సొమ్మును ఉపయోగించి కనీసం ప్లాంట్లను ఏర్పాటు చేయలేని అసమర్థ పాలనకొనసాగుతోంది. ఆక్సిజన్ ప్లాంట్ల ఖర్చెంత కేవలం రెండు వందల కోట్ల రూపాయలు. అవి సాధారణ సమయాల్లో కూడా ఉపయోగపడేవే తప్ప మరొకటి కాదు. ఇవిగాక మారుమూల ప్రాంతాల్లో మరో వంద ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు కోరాయి. సాధారణ రోజుల్లో 100150 రూపాయలుండే సిలిండర్ ధర రెండు వేల వరకు పెరిగిపోయింది. పట్టించుకొనే దిక్కులేదు. వెంటిలేటర్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, మన దేశంలోనే తయారు చేయగలం అని చెప్పారు. తప్పులేదు, ముందు జాగ్రత్త ఉంటే వాటిని తగినన్ని సిద్ధంగా ఉంచుకుంటే ఎన్నో ప్రాణాలు నిలిచేవన్నది వాస్తవం కాదా? కరోనా పోయిన తరువాత వాటిని జిల్లా, తాలూకా ఆసుపత్రులకు అందచేయవచ్చు కదా?
కరోనా చికిత్సలో రెమిడెసివర్ ఎంత ప్రభావం చూపుతుందో ఇప్పటికీ తేలలేదు. అయినా వేలం వెర్రిగా దాని కోసం జనం ఎగబడుతున్నారు. “ఈ నీచ సమాజంలో భాగమైనందుకు సిగ్గుగా ఉంది” అని బాంబే హైకోర్టు మహారాష్ర్ట ప్రభుత్వం మీద విరుచుకుపడింది. గతంలో తాము ఆదేశించిన విధంగా నాగపూర్ ఆసుపత్రులకు పదివేల రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఎందుకు సరఫరా చేయలేదని మండి పడింది. దాని గురించి అధికారులు చెప్పిన వాదనలను కోర్టు అంగీకరించలేదు. ముంబై, పరిసర జిల్లాలకు ఎక్కువ సరఫరా చేస్తున్నారు, నాపూర్‌తో సహా మిగతా ప్రాంతాలను పట్టించుకోవటం లేదని కేసు దాఖలైంది. కోర్టు ఈ వ్యాఖ్యలకు ముందు మహారాష్ర్టలో జరిగిన ఒక ఉదంతం ఆసక్తి కలిగించటమే కాదు, చివరికి కరోనాను కూడా సొమ్ము చేసుకొనే బిజెపి పన్నాగాన్ని బయట పెట్టింది.
కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్‌లో ఫ్యాక్టరీ, గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న బ్రక్ ఫార్మా కంపెనీ అరవై వేల రెమిడెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా తరలిస్తుండగా ముంబై పోలీసులు పట్టుకున్నారు. కంపెనీ డైరెక్టర్‌ను పోలీసులు విచారించారు. ఆ చర్యను నిరసిస్తూ బిజెపి నేత అయిన మహారాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన అనుచరులతో వచ్చి ఆందోళనకు దిగారు. వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయించేందుకు తరలిస్తున్నారని పోలీసులు అనుమానించారు. ఎఫ్‌డిఏ అధికారుల అనుమతితో తామే వాటిని కొనుగోలు చేశామని బిజెపి నేతలు తొలుత బుకాయించారు. అలాంటి అనుమతి లేదని తేలిపోయింది. ఎగుమతి కోసం తయారు చేసిన వాటిని నిషేధం కారణంగా స్థానిక మార్కెట్లో విక్రయించేందుకు అనుమతి కోరుతూ కంపెనీ అధికారులు ఔషధ యంత్రాంగానికి దరఖాస్తు చేశారు. వాటిని రాష్ర్ట ప్రభుత్వానికి విక్రయించవచ్చని అనుమతి ఇచ్చారు తప్ప బిజెపికి ఇమ్మని ఎక్కడా లేదు. దాంతో రాష్ర్ట ప్రభుత్వం ద్వారా ప్రజలకు దానంగా ఇచ్చేందుకు కొనుగోలు చేశాం తప్ప బ్లాక్ మార్కెట్లో విక్రయించటానికి కాదని మరొక కహానీ చెప్పారు.
ఇక్కడ తలెత్తే ప్రశ్నలకు సమాధానాలు లేవు. అదే నిజమైతే ముందుగానే బహిరంగంగానే ప్రకటించవచ్చుగా, తమ వంతు విరాళం అని ప్రచారం చేసుకోవచ్చు, దానిలో దాపరికం ఎందుకు? నిజంగా బిజెపికి అంత దాతృత్వం ఉంటే దేశ వ్యాపితంగా రెమిడెసివిర్‌కు డిమాండ్ ఉన్నపుడు దేశమంతటికీ కాకుండా మహారాష్ర్టకే ఎందుకు ఇవ్వాలి. అసలు ఒక రాజకీయ పార్టీకి ఔషధాన్ని అమ్మటానికి సదరు కంపెనీకి అధికారం ఎక్కడుంది? అంటే ఆ పార్టీ రాజకీయ ప్రచారానికి సదరు కంపెనీ మద్దతు ఇచ్చినట్లే? ప్రభుత్వం చేయలేని పనిని మేం చేస్తున్నామని చెప్పుకొనే చవకబారు రాజకీయ ప్రయోజనం కోసం బిజెపి వేసిన ఎత్తుగడ తప్ప దీనిలో మరొకటి కనిపించటం లేదు.
అంతకక్కుర్తి అవసరమా? దేశ చరిత్రలో ఎక్కడైనా ఇలాంటిది జరిగిందా? కమ్యూనిస్టులు వివిధ సందర్భాలలో బహిరంగంగానే ధన, వస్తు రూపంలో బాధితులకు విరాళాలు వసూలు చేశారు. క్యూబా, పాలస్తీనా వంటి దేశాలకు ప్రభుత్వాలతో సంప్రదించే విరాళంగా వచ్చిన సొమ్ముతో వారికి అవసరమైన వాటిని కొనుగోలు చేసి పంపారు తప్ప ఇలాంటి పనులు చేయలేదు. జనం ముందుకు కొందరు మహాత్ములు ఊరకరారు అదే విధంగా కొందరు పోయేటపుడు ఊరికే పోరు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఏం జరుగుతుందో చూడటం తప్ప సామాన్యులం చేయగలిగింది ఏముంది ?