Monday, December 23, 2024

జాతీయ రాజకీయ వేడి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి దానికి మధ్య ఇంత వరకు కొనసాగిన అఖాతం పూడిపోయింది. బెంగళూరులో సోమవారం మొదలైన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి సమావేశానికి ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ హాజరయ్యారు. ఢిల్లీలో సేవలపై, వాటికి సారధ్యం వహించే ఐఎఎస్‌లపై అధికారం ఆప్ ప్రభుత్వానిదేనని, మంత్రివర్గ సిఫారసుల మేరకే లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సును రాజ్యసభలో ప్రవేశపెట్టేటప్పుడు ఉమ్మడి ప్రతిపక్షం దానిని ఓడించాలని ఆప్ కోరుతున్నది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు కీలకం. ఢిల్లీ స్థానిక రాజకీయాల్లో కాంగ్రెస్, ఆప్ లు పరస్పర వ్యతిరేక ధృవాలు కాబట్టి, ఆ పార్టీ ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వకపోవచ్చనే అనుమానంతో ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశానికి తాను హాజరు కావాలంటే కాంగ్రెస్ మద్దతు ప్రకటించాల్సిందేనని ఆప్ డిమాండ్ చేస్తూ వచ్చింది. కేంద్రంలో 2024 లోక్ సభ ఎన్నికలలో బిజెపి ని ఓడించే లక్ష్యంతో 24 ప్రతిపక్షాలు మొదటిసారిగా పాట్నాలో జరిపిన సమావేశానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించబోదని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అప్పుడు ప్రకటించారు. అయినా సంతృప్తి చెందని ఆప్ ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తామంటూ కాంగ్రెస్ నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని పట్టు బట్టింది. లేకపోతే బెంగుళూరు సమావేశానికి హాజరు కాబోమని స్పష్టం చేసింది. దానితో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తానని స్పష్టంగా వెల్లడించడం, కేజ్రివాల్ బెంగుళూరు సభకు వెళ్లడం జరిగిపోయాయి. పాట్నాలో జరిగిన మొదటి ప్రతిపక్ష సమావేశంలో పరస్పర పలకరింపులు, పరామర్శలతో ముగిసిపోయింది. బెంగళూరు సమావేశంలో కొంత పురోగతి కనిపిస్తుందంటున్నారు. ఈ సమావేశం నేడు కూడా కొనసాగుతుంది. నేటి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొంటారని ఎదురుచూస్తున్నారు. బెంగుళూరు సమావేశానికి సోనియా, రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, మమతా బెనెర్జీ, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మొహమ్మద్ సయీద్, ఎంకె స్టాలిన్ వంటి ముఖ్య నేతలంతా హాజరయ్యారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శరద్ పవార్ మాత్రం మొదటి రోజు హాజరు కాలేదు. నేటి భేటీకి ఆయన వస్తారని ఎన్‌సిపి ప్రకటించింది. పాట్నా సమావేశాలకు అగ్ర భాగాన కనిపించిన పవార్ ఇప్పుడు రాలేక పోడానికి ఆయన పార్టీలో ఇటీవల అజిత్ పవార్ వర్గం చేసిన తిరుగుబాటే కారణమై ఉండాలి. కలిసి బిజెపిని గద్దె దించాలనే ఆరాటం ప్రతిపక్షాల్లో ఎంత ఎక్కువగా ఉందో ఈ సమావేశాలకు అగ్ర నేతలంతా హాజరైన తీరే తెలియ జేస్తున్నది. అయితే అందుకు వీలుగా తమ మధ్య గల విభేదాలను అవి మరిచి పోవడమో తాత్కాలికంగానైనా పక్కన బెట్టి కలిసి పని చేయడమే జరుగుతుందో లేదో అన్నది చాలా ముఖ్యమైన అంశం.ప్రాంతీయ రాజకీయాల వల్ల ప్రతిపక్షాల మధ్య ఐక్యత దెబ్బ తినే అవకాశం ఉందని శరద్ పవార్ జోస్యం చెప్పారు. అయితే మహారాష్ట్రలో తాను ద్వేషిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే చేయి కలిపి మహా వికాస్ అఘాదీ కూటమిని ఆయన నిర్మించాలేదా, అంతవరకు తాము దూరంగా ఉండిన ఉద్ధవ్ థాకరే శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా? పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్‌కి త్రుణమూల్ కాంగ్రెస్‌కి పడదు అని శరద్‌పవార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉదాహరించారు. అయితే కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో దానికి మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ ప్రకటించి ఉన్నారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కి వామాపక్షాలకు కూడా బొత్తిగా పొసగదు. ఈ వైరుధ్యాలను ప్రతిపక్షాలు ఎలా పరిష్కరించు కొంటాయానే దాని మీదనే బిజెపిపై ఉమ్మడి పోరాటం విజయవంతమయ్యే అవకాశాలను పెంచుతుంది. జాతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సోమ,మంగళవారాల్లో చెప్పుకోదగిన ప్రకంపనలు చోటు చేసుకొంటున్నాయి. బెంగళూరులో ప్రతిపక్షాల రెండో రోజు భేటీ జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో కేంద్ర పాలక కూటమి ఎన్‌డిఎ పక్షాల విస్తృత సమావేశం జరుగుతున్నది. ఇది చాలా అరుదైన సన్నివేశం. 2024 లోక్ సభ ఎన్నికలకు పది మాసాల ముందే రెండు శిబిరాల్లోనూ ఇంత కదలిక కనిపించడం విశేషం. ఈ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా వరుసగా మూడో సారి దేశాధికారాన్ని పొందాలని బిజెపి ఆరాటపడుతున్నది. దేశాన్ని సెక్యులర్ రాజ్యాంగానికి దూరం చేసి, హిందూ మత రాజ్యంగా మార్చాలని బిజెపి సంకల్పించిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రాల అధికారాలను, హక్కులను కాలరాసి, సమాఖ్య నీతికి తల కొరివి పెట్టాలని బిజెపి చూస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర పాలక పక్షంగా బిజెపి తన చెప్పు చేతల్లోని దర్యాప్తు సంస్థలను ప్రతిక్షాలపై ప్రయోగిస్తున్నది. అందు చేత దానిని ఓడించి తీరాలని ప్రతి పక్షాలు గట్టిగా అనుకొంటున్నాయి. ఇప్పటి నుంచి ఇరు కూటములు వేసే ప్రతి అడుగు ప్రధానమైనదే. దేశ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే బిజెపిని ఓడించడం అత్యంత అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News