సామాజిక మార్పు, చైతన్యం లక్ష్యాల సాధనలో ముందంజ
న్యూఢిల్లీ : తెలంగాణ లోని సిరిసిల్ల జిల్లా రాజన్నపేట కొవిడ్ నుంచి పూర్తి స్వస్థత పొందిన గ్రామంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వ్యాక్సినేషన్ సాధించడం లోనే కాదు సామాజక ప్రవర్తన, మార్పు తదితర ఉన్నత లక్షాలు సాధించడంలో దేశం మొత్తం మీద అగ్రస్థాయి గ్రామంగా గుర్తింపు పొందింది. దేశం లోని డాక్టర్లు, వాలంటీర్లు కలసి సమష్టిగా రూపొందించిన ప్రాజెక్టు మడాడ్ ప్రభుత్వ సమన్వయంతో ఇది సాధించడమైంది. ఆ గ్రామం లోని అర్హులైన 1328 మంది వయోజనులంతా జులై 31 నాటికి టీకా మొదటి డోసు పొందగలిగారని దాంతో గ్రామానికి కొవిడ్ నుంచి పూర్తి స్వస్థత పొందిన స్థాయి లభించిందని ప్రాజెక్టు మడాడ్ తెలియచేసింది.
దీన్ని సాధించడానికి ప్రాజెక్టు మడాడ్ ఐదు లక్షాల తో సుదీర్ఘ ప్రణాళిక రూపొందించింది. సాధికారత, గ్రామీణ ఆరోగ్య భద్రతలో కార్యకర్తల సామర్ధం, ప్రాంతీయ మాండలిక బాషలో కొవిడ్ దుష్ప్రచార సమాచారాన్ని కట్టడి చేయడం, సామాజిక బాధ్యత పెంపొందించడం, టీకాలను ఆమోదించడం, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సామూహిక పంపిణీ సాధించేలా వ్యాక్సిన్ల సరఫరా తదితర అంశాలను లక్షంగా పెట్టుకుని అమలు చేయగలిగారు. త్రిపుర, గోవా, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్, రాష్ట్రాల్లో అనేక గ్రామాలు అర్హులైన వయోజనులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందించినప్పటికీ అనేక లక్షాలతో జాతీయ స్థాయిలో కొవిడ్ విముక్తి గ్రామంగా రాజన్నపేట గుర్తింపు పొందిందని ప్రాజెక్టు మడాడ్ పేర్కొంది.