టాస్క్‌ఫోర్స్, వర్కింగ్ గ్రూప్‌లో రాష్ట్ర పిసిసిఎఫ్‌కు చోటు
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ అటవీ విధానం , అటవీ పరిరక్షణ చట్టం -1980కి అవసరమైన మార్పులు, ఆగ్రో ఫారెస్ట్రీకి ప్రోత్సాహం, అడవుల బయట పచ్చదనం పెంపు కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్సు కమిటీని ప్రకటించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నేతృత్వంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ చైర్మన్‌గా మరో 18 మందితో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మెజారిటీ సభ్యులు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే అడవులు, పర్యావరణం సంబంధిత శాఖలు, సంస్థల ఉన్నతాధికారులు. ఇదే కమిటీలో తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్), అటవీ దళాల అధిపతి ఆర్‌ఎం. డోబ్రియాల్‌కు స్థానం దక్కింది.
టాస్క్ ఫోర్స్ సూచనలను పరిగణలోని తీసుకుని, అమలు చేసేందుకు మరో వర్కింగ్ గ్రూప్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో తెలంగాణ పిసిసిఎఫ్‌కు చోటు కల్పించారు. జాతీయ స్థాయిలో అటవీ విధానాల రూపకల్పనపై ఏర్పాటు చేసిన రెండు ఉన్నతస్థాయి కమిటీల్లో తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారికి చోటు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణకు హరితహారం ద్వారా ఏడేళ్లుగా రాష్ట్రం గణనీయమైన పచ్చదనం పెంపుతో పాటు వినూత్న పర్యావరణహిత చర్యలను తీసుకుంది. దీనిని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉన్నతస్థాయి కమిటీలో తెలంగాణకు చోటు దక్కింది.
ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థాయిలో బలమైన సంకల్పంతోనే పచ్చదనం పెంపు కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని, జంగల్ బచావో- జంగల్ బడావో నినాదం, హరితనిధి ఏర్పాటు జాతీయ స్థాయిలో ఆదర్శవంతమైందని అందుకే ఈ గుర్తింపు దక్కిందని పిసిసిఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్ అన్నారు. తెలంగాణ మోడల్ ను జాతీయ స్థాయిలో వివరించటంతో పాటు, కొత్త అటవీ విధానం, అటవీ చట్టానికి మార్పు చేర్పులు మరింత పర్యావరణహితంగా ఉండేలా టాస్క్‌ఫోర్స్ కమిటీతో కలిసి పనిచేస్తామని ఆయన వెల్లడించారు. మే 5న ఢిల్లీలో జరిగే టాస్క్ ఫోర్సు సమావేశానికి పిసిసిఎఫ్ డోబ్రియల్ హాజరుకానున్నారు.