హైదరాబాద్ : దేశవ్యాప్త బొగ్గు గనులు , లోహ గనులకు సంబంధించిన రెస్క్యూ జట్లకు జాతీయస్థాయిలో నిర్వహించే వార్షిక పోటీలను ఈసారి తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో పదేళ్ల త్వరాత ప్రతిష్టాత్మక పోటీలకు సింగరేణి కాలరీస్ మరోమారు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్‌లో ఒక సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో డిజిఎంఎస్ నుండి మైన్స్ రెస్క్యూ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న డిఎంఎస్ శ్యామ్ మిశ్రా అధ్యక్షత వహించగా.. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ భూషణ్ ప్రసాద్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సింగరేణి సంస్థ నుండి డైరెక్టర్ ఆపరేషన్ ఎన్‌వికె. శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ జి వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ సేఫ్టీ గురవయ్య , జనరల్ మేనేజర్ రెస్క్యూ ఎస్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ సేఫ్టీ జ్ఞాన సుందరం, మైన్స్ రెస్క్యూ స్టేషన్ సూపరింటెండెంట్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇంకా 8 కోల్ ఇండియా అనుబంధ బొగ్గు సంస్థల ప్రతినిధులు, యురేనియం, జింక్, కాపర్ తదితర లోహ ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
జాతీయస్థాయి మైన్స్ రెస్క్యూ పోటీల్ని ఏడాదికి ఒకసారి ఏదో ఒక ఎంపిక చేసిన బొగ్గు సంస్థ లేదా లోహ ఉత్పత్తి సంస్థల రెస్క్యూస్టేషన్‌లో నిర్వహిస్తుంటారు. కాగా ఈ ఏడాది జరగనున్న జాతీయస్థాయి పోటీలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో నిర్వహించాలని ప్రతిపాదించగా దీనికి సమావేశంలో పాల్గొన్న అన్ని కంపెనీల ప్రతినిధులు తమహర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ భూషణ్ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ జాతీయస్థాయిలో రెస్యూ పోటీలు నిర్వహించడానికి సింగరేణి సంస్థ పూర్తి సామర్థ్యం, సౌకర్యాలు కలిగి ఉందని, గతంలో కూడా మూడుసార్లు జాతీయస్థాయి రెస్క్యూ పోటీలను విజయవంతంగా నిర్వహించిందని తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ ఎన్‌వికె. శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ జి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ రెస్క్యూ విభాగాన్ని పూర్తిగా ఆధునికీకరించిందని, జాతీయస్థాయిలో గతంలో జరిగిన రెస్క్యూ పోటీలలో తమ జట్లు అనేకమార్లు ఛాంపియన్ షిప్‌లను సాధించాయని, తమకు ఉన్న అనుభవంతో నవంబరులో తలపెట్టిన జాతీయస్థాయి పోటీలను సమర్థంగా నిర్వహిస్తామని ప్రకటించారు. సింగరేణి జనరల్ మేనేజర్ రెస్క్యూ గురవయ్య ఈ సందర్భంగా సింగరేణి సంస్థలో జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు గల సౌకర్యాలను ,అవకాశాలను వివరించారు.
25 జట్లు ..5 రోజులపాటు పోటీలు :
ఈ నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ ఒకటో తేదీ వరకు రామగుండం 2 లో ఉన్న మైన్స్ రెస్క్యూ స్టేషన్ లోనూ, 7 ఎల్‌ఈపి గనిలోను ఐదు రోజులపాటు ఈ రెస్క్యూ పోటీలను నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ పోటీల్లో కోల్ ఇండియా అనుబంధ 8 బొగ్గు కంపెనీలు, ఆతిథ్య సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తో పాటు యురేనియం కార్పొరేషన్ ఇండియా, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ,హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మొదలైన 10 సంస్థల నుండి సుమారు 25 జట్లు పాల్గొనబోతున్నాయి. పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహక కమిటీని యాజమాన్యం ఏర్పాటు చేయనుంది.