మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయ రహదారి భద్రతా వారోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రపతి నిలయంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆరిజన్ ఫార్మాస్యూటికల్స్, మియాపూర్ సిబ్బంది, రహదారి భద్రత కోసం పనిచేస్తున్న ఎన్‌జిఓలు, వివిధ పాఠశాలల నుండి 400 విద్యార్థినీ విద్యార్థులు, రాష్ట్రపతి నిలయం సిబ్బంది, ఐటిబిపి సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా ఆరిజన్ ఫార్మాస్యూటికల్స్ సిబ్బంది రహదారి భద్రత గురించి ఫ్లాష్ మొబును ప్రదర్శించారు. ర్యాలీలోని సభ్యులందరూ రహదారి భద్రతకు సంబందించి నినాదాలు చేశారు. ఆ తర్వాత సభ్యులందరు రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో రహదారి భద్రతకు సంబంధించిన వీడియోలు ప్రదర్శించారు. అలాగే విద్యార్థినీ విద్యార్థులకు రహదారి భద్రత ఆవశ్యకతను మేనేజర్ డా.కె.రజని ప్రియా వివరించారు. సమావేశంలో తిరుమలగిరి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ బోధిశ్రీ, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ చైర్మన్ వినోద్ కుమార్, ఆరిజాన్ ఫార్మాస్యూటికల్స్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ హెడ్ దీపేన్ శ్రాఫ్, రెడ్‌క్రాఫ్ట్ ఆర్గనైజేషన్ ముఖ్య అతిధులుగా హాజరై రహదారి భద్రతా నియమాల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. తదుపరి రాష్ట్రపతి నిలయ అధికారి డా. కె. రజనీ ప్రియా ధన్యవాదాలు తెలిపారు.