Thursday, January 23, 2025

ఆన్‌లైన్‌లో హాజరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పథకం కింద చేపట్టే అన్నిరకాల పనులను నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్ (ఎన్‌ఎంఎంఎస్) ద్వారా నమోదు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పనుల్లో కూలీల ’మాన్యువల్ అటెండెన్స్’కు చెల్లుచీటీ పలికింది. ఉపాధి హామీ పనులను నిర్వహించే ప్రదేశంలోనే జియోట్యాగ్ చేసి ఆన్‌లైన్‌లో హాజరుకు ఏర్పాట్లు చేసింది. ఇకపై లైవ్ లొకేషన్లో మొబైల్ యాప్ ద్వారానే అన్నిరకాల పనులకు సంబంధించిన పనుల వివరాలు, కూలీల హాజరును నమోదు చేయాలని స్పష్టం చేసింది.

వ్యక్తిగత మరుగుదొడ్లు, సోప్ పిట్స్, క్యాటిల్ షెడ్స్ తదితర వ్యక్తిగత ప్రయోజన పనులు, ప్రాజెక్టులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు, ఉపాధి హామీ పథకం కమిషనర్లకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఉపాధిహామీ పథకం అమలు డైరెక్టర్ ధర్మవీర్ ఝా ఉత్తర్వులను పంపించారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడం, పౌర సమాజం పర్యవేక్షణకు వీలుగా కొత్త నిబంధనలు తెచ్చినట్టు అందులో పేర్కొన్నారు.
* రోజుకు రెండుసార్లు హాజరు తప్పనిసరిగా..
ఉపాధి హామీ కూలీల హాజరును రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా లైవ్ లొకేషన్లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలనే నిబంధనను కేంద్రం ఈ ఏడాది మే నెలలోనే తీసుకొచ్చింది. కూలీల అటెండెన్స్ రోజుకు రెండుసార్లు సమయంతో సహా నమోదయ్యేలా, కూలీల ఫొటోలను జియోట్యాగ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. అయితే ఇరవై మందికిపైగా కూలీలు పనిచేసే సైట్లలో మాత్రమే వాటిని అమలు చేశారు. ఇప్పుడు ఉపాధి హామీ కింద చేపట్టే అన్ని పనుల్లో (వ్యక్తిగత ప్రయోజన పనులు మినహా) ఎన్‌ఎంఎంఎస్ ద్వారానే కూలీల హాజరు నమోదు చేయాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. జనవరి 1 నుంచి ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.
* ఆన్‌లైన్ నమోదులో ఇబ్బందులు…
ఉపాధి హామీ పనులు జరిగే మారుమూల ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సమస్య ఉండటం, అందరికీ స్మార్ట్ ఫోన్లు, డేటా లేకపోవడం వంటి సమస్యల వల్ల ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల అటెండెన్స్ నమోదు ఇబ్బందిగా ఉంటోందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. కూలీలు చేసే పనులు కొలతలు, పరిమాణం ప్రకారమే కూలీ డబ్బు ఇస్తున్నపుడు కొత్త నిబంధనలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సరిగా పని, కూలీ సొమ్ము అందక ఉపాధి హామీ పథకానికి గ్రామీణ పేదలు దూరమవుతున్నారని అంటున్నారు. లైవ్ లొకేషన్లో మొబైల్ ద్వారా అటెండెన్స్ నమోదు వంటి చర్యలు మరింత ప్రతిబంధకంగా మారతాయని వారు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News