దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర రానే వచ్చింది. రెండేళ్లకు ఒకసారి మేడారం జనసంద్రమైన సమయం ఆసన్నమైంది. పౌరుషం గల తెలంగాణ ఆడబిడ్డల ఆత్మత్యాగాలును స్మరించుకునే క్షణాలు దగ్గరకొచ్చాయి. ఈ జాతర గిరిజన సాంప్రదాయ రీతిలో జరగడం ఒక విశేషం అయితే అందుకు దేశ వ్యాప్తంగా భక్తులు పట్టం కట్టడం అతిపెద్ద విశేషం. ఫిబ్రవరి 16-19 తేదీల మధ్య నాలుగు రోజులు జరిగే ఈ జాతరలో వివిధ రకాల పూజా ప్రక్రియలు, ఆదివాసుల ప్రత్యేక వస్త్రధారణ తదితర అంశాలు ఈ ఉత్సవానికి అంతర్జాతీయ ఖ్యాతిని ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన ఈ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి ఇప్పటి వరకు చాలా సార్లు ప్రతిపాదనలు వెళ్ళినా ఇంత వరకు జాతీయ హోదా లభించలేదు.
900 ఏళ్ల చరిత్ర కలిగిన జాతర..
కోయ గిరిజనుల ఉనికి కోసం పోరు సల్పిన సమ్మక్క సారలమ్మ జాతర క్రీస్తు శకం 1260 నుండి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుండి కొనసాగుతున్నట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పరిపాలించేవారు. ఆయన కాకతీయుల సామంతరాజు. ఆయన సతిమణి సమ్మక్క. పగిడిద్దరాజు సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము. ఆ కాలంలో వరుసగా మూడు నాలుగేళ్ల పాటు అనావృష్టి ఏర్పడటంతో ప్రజలు పన్నులు కట్టలేని స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు కప్పం చెల్లించేందుకు నిరాకరించడంతో ప్రతాపరుద్ర చక్రవర్తి గిరిజనులను అణిచి వేయడానికి సైనికులను పంపాడు. పగిడిద్దరాజు అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ అల్లుడు గోవిందరాజులతో కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి వీరోచితంగా పోరాడి వీర మరణం పొందినారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి పరాశక్తి అవతారమెత్తి అపర కాళిగా విజృంభించి కాకతీయ సైన్యాలను పరుగెత్తించి అంతం చేస్తుంది. ఓటమి తప్పదని భావించిన కాకతీయ సైనికులు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుండి పొడవడంతో యుద్ధభూమి నుండి వైదొలగి మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వద్ద అదృశ్యమవుతుంది. మోసంతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కాదని ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలని గ్రహించిన ప్రతాపరుద్రుడు అప్పటి నుండి సమ్మక్క భక్తుడుగా మారతాడు.
ప్రతాపరుద్రుడు ఈ స్థలంలో రెండు గద్దెలు కట్టించి రెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్సవం జరిపించినట్లు చరిత్ర చెబుతోంది. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలయ్యే ఈ జాతర నాలుగు రోజులు జరుగుతుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను కొండ్రాయి నుంచి గోవిందరాజు పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకువస్తారు. రెండవ రోజున మేడారం సమీపంలోని చిలకలగుట్ట నుంచి సమ్మక్కను దేవతను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు. మూడో రోజు అమ్మవార్లకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తమ కోరికలు తీర్చమని భక్తులు బెల్లం (బంగారం)ను నైవేద్యంగా సమర్పించుకుంటారు. నాలుగవ రోజు పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజులు వన ప్రవేశం చేయిస్తారు. దీంతో జాతర ముగిస్తుంది. ఎంతో చరిత్ర నేపథ్యం కలిగిన సమ్మక్క సారక్క జాతరను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. విభజన తర్వాత నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో 2014 రాష్ట్ర పండుగ ప్రకటించి ఘనంగా జాతర జరుపుతున్నారు. ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 332.71 కోట్ల నిధులను కేటాయించారు. ఈ ఏడాది రూ.75 కోట్ల నిధులు కేటాయించి రవాణా, త్రాగునీరు, భద్రత చర్యలు వైద్య సదుపాయాలు తదితర 21 శాఖల వారీగా నిధులు ఖర్చు చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర , ఒడిసా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆరు ప్రధాన రహదారుల ద్వారా ఈ జాతరకు 1 కోటి 30 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా.
భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధిక మంది భక్తులు హాజరయ్యే పండుగ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఇ) ద్వారా జాతరకు ఎంత మంది వచ్చారో 99 శాతం కచ్చితత్వంతో తెలుసుకుంటారు. దేశంలో ఏ ఉత్సవంలో వినియోగించని విధంగా కృత్రిమ మేథో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా తొక్కిసలాట జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా ఏర్పాట్లు చేస్తుంది. ఇంతటి చరిత్ర నేపథ్యం కలిగిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రతిపాదన చేసి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత జాతరలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా ఈ మహా జాతర ప్రాముఖ్యత గురించి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లి జాతీయ హోదా ఇప్పిస్తానని వాగ్దానం ఉత్త మాటలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ మహా జాతరకు జాతీయ హోదా కల్పించి నిధులు విడుదల చేస్తే జాతర ప్రాశస్త్యంను ప్రపంచం గుర్తిస్తుంది. యునెస్కో గుర్తింపు లభిస్తుంది.
అంకం నరేష్
6301650324