Thursday, January 23, 2025

జాతీయ సమైక్యతాదినం

- Advertisement -
- Advertisement -

సెప్టెంబర్ 17 ని కొందరు విలీన దినంగా, మరి కొందరు విమోచన దినంగా, తెలంగాణ ప్రభుత్వం సమైక్యత దినంగా పేర్కొంటుంది. ఒకే రోజు, ఒకే సంఘటన పేర్లు మాత్రం అనేక రకాలు. ఎవరి వాదనలో వాస్తవం ఎంత? ఏది నిజం? ఏది అబద్ధం? సెప్టెంబర్ 17 విలీన దినం. 1947 ఆగస్టు 15 న బ్రిటీషు పాలన అంతమై హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ వారి రాక పూర్వం ఉన్న స్థితికి వస్తుందని అనగా సర్వ స్వతంత్రం అవుతుందని ఉస్మాన్ అలీఖాన్ ప్రకటించడంతో యావద్దేశం సంబరాల్లో ఉంటే హైదరాబాద్ మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేకపోయింది. గత్యంతరం లేక 1947 అక్టోబర్ 29న నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఢిల్లీతో యదార్థ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం స్వేచ్ఛ పూర్వక పరిష్కారం కోసం ఒక సంవత్సరం కాలం ఆగాలని నిర్ణయించారు. కాని హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యదార్థ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. నిజాం తనకు సహాయం చేయమని బ్రిటిష్ చక్రవర్తి ఆరవ జార్జికి, ప్రధాని అట్లీకి వ్యక్తిగతంగా లేఖలు రాశారు. బ్రిటిష్ ప్రతిపక్ష నాయకుడు విన్స్‌టన్ చర్చిల్ కి హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ అలీ లేఖ రాసారు.

నిజాం హైదరాబాద్ సంస్థానం విషయమై 1947 ఆగస్టు 21న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేశారు. యదార్థ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ కు 20 కోట్ల రూపాయల రుణ సహాయం అందించారు. హైద్రాబాద్ రాజ్యంలో భారత్ సిక్కాను నిషేధించారు. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ ఎర్రకోటపై అసఫ్ జాహి పతాకం ఎగరవేస్తానని ప్రగల్భాలు పలికారు.
నిజాం కాలంలో భూస్వాములు, జాగీర్దార్లు, దేశముఖ్‌లు వారి తాబేదార్లు, నిజాం దోపిడీకి మూలస్తంభాలు. 60 వేల ఎకరాల భూస్వామి విసునూరు రామచంద్రా రెడ్డి, ఆయన కొడుకు బాబు దొర, ఆయన తల్లి జానకమ్మ ప్రజా కంటకులు. వీరిని వ్యతిరేకించినందువల్లే తొలి రక్తప్రేరణ బందగి రక్త తర్పణ జరిగింది. విస్నూరు గడీపై పోరాటం ప్రారంభించింది చాకలి ఐలమ్మ. దొడ్డి కొమురయ్య, మొగులయ్య గౌడ్, బాలెం సమర వీరులు, మునగాల పోరాటం, పరిటాల ప్రజా ఉద్యమం, తిమ్మాపూర్, అల్లిపూర్‌లో తిరుగుబాట్లు, ముల్కల గూడెం తిరుగుబాటు, గాంధీ దృష్టికి వెళ్లిన ఆకునూరు, మాచిరెడ్డి పల్లి దుర్ఘటనలు, ఆజాంగోరి ఆగడాలు, నార్లపురం ముక్తేదార్ దౌర్జన్యం, పింగళిప్రతాప్ రెడ్డి, మల్లపురం జమీందారు దురాగతాలు మొత్తంగా తెలంగాణలో నిజాం నవాబు చేతి కింద ఉన్న దొరలు, భూస్వాముల అకృత్యా లు పెరిగిపోయాయి.

ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజం, కమ్యూనిస్టు పార్టీ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టాయి. దీనితో హైద్రాబాబ్‌పై చర్య తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనినే పోలీస్ చర్య అంటారు.ఈ పోలీసు చర్యకు సదరన్ కమాండర్ జిఒసి అయినా లెఫ్టినెంట్ జనరల్ మహారాజసింగ్ నేతృత్వం వహించారు. షోలాపూర్ నుండి మేజర్ జనరల్ జె.ఎం.చౌదరి, విజయవాడ నుంచి మేజర్ జనరల్ రుద్ర నాయకత్వంలో సైన్యాలు హైదరాబాద్ వైపు బయలుదేరాయి. సెప్టెంబర్ 17న లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసింది. సాయంత్రం 7 గం.లకు నిజాం రాజు దక్కన్ రేడియోలో హైదరాబాద్ భారత దేశంలో చేరుతున్నట్లు ప్రకటించాడు. 1948 సెప్టెంబర్ 22న కేబుల్ ద్వారా నిజాం భద్రతా మండలిలో తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం అందించారు. జె.ఎం. చౌదరి మిలిటరీ గవర్నర్‌గా, నిజాం రాజ్యాధినేతగా వ్యవహరించారు. తర్వాత ఎంకె వెల్లోడి ముఖ్యమంత్రి స్థానాన్ని, మీరు ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్ స్థానాన్ని అలంకరించారు. భారత దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది.

నిజాం కాలంలో భూస్వాములు, జాగీర్దార్లు, దేశముఖ్‌లు, రజాకార్లు ప్రజాకంటకులుగా మారి హత్యాకాండ, అత్యాచారాలు, మారణ హోమాలతో హైదరాబాద్ రాజ్యం అట్టుడికిపోయింది. రజాకార్లు గాండ్లపూర్‌వద్ద మహిళాలను నగ్నంగా చేసి బతుకమ్మ ఆడించారు. నేరెడ గ్రామంలో స్త్రీలకు పైజామాలు తొడిగించి తొండలు వదిలి పైచాచిక ఆనందం పొందారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బోర్‌వెల్లి దళితవాడలో స్త్రీలందరిని మానభంగం చేయగా వారందరు ఆత్మహత్య చేసుకున్నారు. సైదాబాద్, నీలాయోగూడెం, సీమలపాడు, నర్మెట, నంగానూర్, నాగారం, రాగిపాడు, నారిగూడెంలో స్త్రీలపై రజాకార్లు హత్యాచారం చేశారు. మోత్కూర్‌లో గడ్డం అమీన్ అకృత్యాలు, సలాఉద్దీన్ అత్యాచారా లు మొదలైనవి ఆనాటి రజాకార్ల అకృత్యాలకు ఉదాహరణలు.
నిజాం లొంగిపోవడంతో ఖాసీం రజ్వీ, రజాకార్లు అరెస్టు చేయబడ్డారు. హైదరాబాద్‌లో భయంకరమైన పరిస్థితి నుంచి విమోచనం కలిగింది. కాబట్టే కొంత మంది సెప్టెంబర్ 17న విమోచనంగా భావిస్తారు. మొత్తంగా విమోచనం అనే వారు ముస్లిం రాజు నుంచి హిందువులు విమోచనం పొందారని అభిప్రాయంతో ఉండవచ్చు. ముస్లిం రాజుకు సహకరించిన భూస్వాముల్లో, జమీందారుల్లో 95% మంది హిందువులు. రజాకార్లను ప్రోత్సహించిన వారిలో హిందూ భూస్వాములు కూడా ఉన్నారు. నిజాం వ్యతిరేక పోరాటానికి ప్రేరణ షేక్ బందగి రక్త తర్పణం.

నిజాం రాజుకు వ్యతిరేకంగా జాతీయ జెండాను ఎగరవేసిన ముస్లింలు సైతం ఉన్నారు. నిజాం కాలేజ్ విద్యార్థి నాయకుడు ఆల్ హైద్రాబాద్ స్టూడెన్స్ యూనియన్ సహాయ కార్యదర్శి రఫీ అహ్మద్ త్రివర్ణ జెండా పతాకాన్ని ఎగుర వేశారు. రజాకార్లకు వ్యతిరేకంగా షోయబుల్లాఖాన్ ఇమ్రోజ్ పత్రికల్లో వ్యాఖ్యలు రాసినందుకు చేతులు నరికి చంపివేయబడ్డాడు.ముగ్దుమ్ మోహియుద్దీన్ నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణకు విమోచనమే అయితే మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను భారత ప్రభుత్వం రాజ్ ప్రముఖ్‌గా నియమించి ఎందుకు గౌరవిస్తుంది? విమోచనమే అనుకుంటే గ్రామాలు వదిలి పారిపోయిన భూస్వాములు పోలీస్ చర్య తరువాత కాంగ్రెస్ నాయకులుగా మారి గాంధీ టోపీలు ధరించి గ్రామాలలోకి వచ్చి పేదలకు పంచబడ్డ భూములను తిరిగి ఆక్రమిస్తుంటే ప్రభుత్వం భూస్వాములకే ఎలా సహకరిస్తుంది? అది విమోచనం అయితే పేద ప్రజల కోసం పని చేసిన హిందువులైన తెలంగాణ సాయుధ పోరాట యోధులను రజాకార్లు చంపిన వారి కన్నా ఎక్కువ మందిని భారత సైన్యం ఎలా చంపుతుంది. ఏ లక్ష్యం కోసం ఎందరో తెలంగాణ సాయుధ పోరాట యోధులు తమ ప్రాణాలను కోల్పోయారో, ఆ లక్ష్యమే నెరవేరలేదు.

సెప్టెంబర్ 17న విశాలమైన, వైవిధ్యభరితమైన భారత దేశంలో అంతే వైవిధ్యభరితమైన తెలంగాణ సమాజం అంతర్భాగమై గంగా జమున తెహజీబ్‌కి నిలయంగా, జాతీయ సమైక్యతకు నిదర్శనంగా తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ నగరం నిలచింది. విలీనం, విమోచనం అని ప్రతి సంవత్సరం పాత గాయాలు ప్రేరేపించి, పోషించడం కంటే మంత్రి వర్యులు కెటిఆర్ ప్రకటించినట్లు జాతీయ సమైక్యత దినంగా జరుపుకొంటూ సామరస్యంగా ముందుకు సాగడమే ఉత్తమం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News