ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వ్యక్తి అస్తిత్వాన్ని నిలబెడుతూ, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. ఓటనేది కుల, జాతి, మత, లింగ, భాషలకు అతీతంగా అందరికీ కల్పించిన సార్వత్రిక సమానత్వ హక్కు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఓటుపట్ల చైతన్యం కలిగించడానికి భారతీయ ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తుంది. భారత్‌లో ఓటర్ల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతుంది. 1951లో 17.32 కోట్ల ఓటర్లుండగా… తాజాగా ఆ సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. త్వరలోనే ఇది 100 కోట్లకు చేరుకోనుందని భారత ఎన్నికల కమిషన్ పేర్కొంది. దీంతో బిలయన్ ఓటర్లు ఉన్న దేశంగా ఇండియా సరికొత్త రికార్డు సృష్టించనుంది. దేశంలో 1829 ఏళ్ల మధ్య వయసున్న యువత 21.7 కోట్ల మంది ఉన్నారు. ఓటర్ల సంఖ్య పెరిగినా… ఓటు వేసేవారి సంఖ్య మాత్రం తగ్గుతుంది. 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 67.4 నమోదు కాగా, 18వ లోక్‌సభ ఎన్నికల్లో 65.7 శాతమే నమోదైనది. మరోవైపు ప్రలోభ రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేసే సంస్కృతి కోల్పోతున్నారు. నేడు ఓటు ఒక సరుకుగా, ఎన్నికల వ్యవస్థ ఒక మార్కెట్‌గా మారింది. ఓటర్లు ప్రలోభాలకు గురికావడమే దీనికికారణం. ముఖ్యంగా డబ్బు, మద్యంతోపాటు రకరకాల కానుకలతో రాజకీయ నాయకులు ప్రజల ఓట్లను కొల్లగొడుతున్నారు.ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. రాజకీయాల్లో నేరస్థుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. మరోవైపు ప్రజాఅవసరాలు తీర్చే సమర్థ ప్రజాప్రతినిధులు రాజకీయాల్లో అరుదుగానే కనిపిస్తున్నారు. భారత రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. తద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడిన్ని ప్రజాస్వామ్యంలో భాగం చేసింది. దీనికి బీజం వేసిన మొట్టమొదటి వ్యక్తి డా. బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకప్పుడు ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు ఓటు హక్కును తిరస్కరించిన చరిత్ర ఆధిపత్య వర్గానిది.
వీరు ఆదాయ పన్ను, భూమిశిస్తూ కట్టేవారికి, డిగ్రీ చదివిన వారికి ఓటు హక్కు కల్పించాలని బ్రిటిష్ వారి ముందు ప్రతిపాదించారు. ఈ క్రమంలో అంబేద్కర్ అట్టడుగు, అణగారిన వర్గాలకు ఓటు హక్కు ఇవ్వాలని బ్రిటిష్ వారిని కోరారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలనే విశ్వమానవ సూత్రాన్ని ప్రతిపాదించాడు. తద్వారా నేడు ఈ దేశ పౌరులందరికీ రాజకీయ భాగస్వామ్యం దొరికింది. అమెరికా లాంటి ఆధునిక దేశమహిళలకు ఓటు హక్కులేని కాలంలోనే భారతీయ స్త్రీలకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదే. ఈ చారిత్రక సత్యం కోట్లాది భారతీయులకు తెలియకపోవడం బాధాకరం. ఓటును సక్రమంగా వాడితే సామాన్య ప్రజలు సైతం పాలకులుగా మారగలరు. కానీ, నేడు మెజారిటీ ప్రజలు ఆత్మగౌరవానికి చిహ్నమైన ఓటును అమ్ముకొని అణచివేతకు గురవుతున్నారు. దీంతో 75 వసంతాల స్వతంత్ర భారత దేశంలో ఇప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. నేటికీ కోట్లాది ప్రజల పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలు ఇంకా సమసిపోలేదు.
ప్రజల్లో కులతత్వం, మతతత్వం వంటి సంకుచిత భావజాలాలు పెల్లుబుకుతున్నాయి. వీటిని మార్చడంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు విఫలమైనాయి. దీనికి తార్కాణం ఓటు దుర్వినియోగమే. అనగా సమర్థులకు ఎన్నుకోవడం లేదు. భారతీయ ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించకుండా గట్టి చర్యలు చేపట్టాలి. నేర రాజకీయాలను అరికట్టాలి. ప్రలోభాలకు గురిచేసే రాజకీయ నాయకులను, వాటి బారినపడే ఓటరును కఠినంగా శిక్షించే చట్టాన్ని తీసుకురాలి. ఎన్నికల సమయంలో మద్యం విక్రయాల్ని నిషేధించాలి. ప్రస్తుతం భారత దేశంలో ఇవిఎంల భద్రతపై ఆందోళన నెలకొంది. పటిష్టమైన ఆధునిక సాంకేతిక భద్రతతో వీటిని వినియోగించాలి. ప్రతి భారతీయుడికి ఓటు ప్రాముఖ్యతను తెలియజేయాలి.
సంపతి రమేష్ 7989579428