బడుగులకు కోటా పెరగాల్సిందే
బీహార్ వైఫల్యం నుంచి గుణపాఠాలు
కార్పొరేట్ల కేంద్రీకృత పాలనతో అన్యాయం
పాట్నా సదస్సులో కాంగ్రెస్ నేత రాహుల్
పాట్నా : అణగారిన వర్గాల సాధికారత, అభ్యున్నతే తమ పార్టీ ముందున్న తక్షణ కర్తవ్యం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. సోమవారం బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు. బీహార్‌లో తప్పిదాలతో తమ పార్టీ చాలా వరకూ గుణపాఠాలు నేర్చుకుందన్నారు. సామాజిక , వర్గ ఆర్థిక విషయాల పరంగా బీహార్‌కు ప్రత్యేకత ఉంది. అణగారిన వర్గాలకు అక్కడ సర్వతోముఖాభివృద్ధి ద్వారా న్యాయం చేయడంలో విఫలం అయ్యామని , లోపం ఎక్కడ జరిగిందనేది బేరీజు వేసుకుంటామని లోక్‌సభలో విపక్ష నేత అయిన రాహుల్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు నెలల ముందు ఇక్కడి పరిస్థితి నేపథ్యంలో రాహుల్ స్పందించారు. బీహార్‌లో ఆర్జేడీ, వామపక్షాల కూటమిగా కాంగ్రెస్ ఈ ఎన్నికలలో బలీయ అధికార పక్షం ఎన్‌డిఎతో తలపడనుంది.
సంవిధాన్ సురక్షా సమ్మేళన్ పేరిట రాజ్యాంగ పరిరక్షణ ఇతివృత్తంతో ఇక్కడ సదస్సు జరిగింది. దేశంలో ప్రధాని మోడీ నాయకత్వపు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పాలనకు శ్రీకారం చుట్టిందని రాహుల్ విమర్శించారు. మొత్తం జనాభాలో కేవలం అయిదు శాతం ప్రాతినిధ్యం వహించే పట్టుమని 10 నుంచి 15 మంది మొత్తం కార్పొరేట్ వ్యవస్థను శాసిస్తున్నారని రాహుల్ స్పందించారు. బీహార్‌లో తాము సరైన విధంగా వ్యవహరించలేదని అంగీకరించే వ్యక్తులలో తాను మొదటివాడిని అని , ఇక్కడ తమ వ్యవహార శైలి ఉండాల్సిన రీతిలో లేదన్నారు. అయితే పొరపాట్లను చక్కదిద్దుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీ, మిత్రపక్షాలతో కలిసి ఇక్కడి ఎస్‌సిలు, ఎస్‌టిలు , ఒబిసిల, పూర్తిగా వెనుకబడ్డ వర్గాల , మైనార్టీల మేలుకు పాటుపడాల్సి ఉంటుందన్నారు.
చాలా కాలం వరకూ బీహార్‌లో ప్రాబల్యం చాటుకున్న కాంగ్రెస్ 1990 నాటి మండల్ ఉద్యమంతో పూర్తిగా వెనుకబడింది. ఇతర పార్టీలతో పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి ఇటీవలి కాలంలో తాము చర్యలు చేపట్టామని వివరించారు. అయితే ఇవి గణనీయం అయినవి కాకపోవచ్చు, కానీ కీలకమైనవే. జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీల పునర్వస్థీకరణ జరిగింది. ఈ విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించాం. అంతకు ముందు పలు డిసిసిలలో అగ్రవర్ణాల ఆధిపత్యం ఉండేది. అయితే ఇప్పుడు భిన్నంగా ఉంది. మూడింట రెండొంతుల డిసిసిలకు బడుగు బలహీన వర్గాల వారి నాయకత్వం వచ్చింది. సంస్థ లో సరైన మార్పులు చేర్పుల విషయంలో తమ పార్టీ అధ్యక్షులు ఖర్గే నుంచి, తన నుంచి వెలువడ్డ నిర్థిష్ట సూచనల మేరకు ఈ పరివర్తన జరిగిందన్నారు. బీహార్‌కు ఘన చరిత్ర ఉంది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా ఇది మౌలిక రాజకీయ మార్పుల నేలగా నిలిచింది. ఈ కోణంలోనే బీహార్ పట్ల తమ పార్టీ ప్రాధాన్యత సాగుతుందన్నారు. మోడీ సర్కారు వైఖరి పూర్తిగా బిలియనీర్ల ప్రయోజనాల యావలోనే సాగుతుందని విమర్శించారు.
దేశవ్యాప్త పరివర్తనకు బీహార్ నుంచే శ్రీకారం
దేశవ్యాప్త మార్పునకు అవసరం అయిన పరిణామం బీహార్ నుంచే నెలకొంటుందని రాహుల్ స్పష్టం చేశారు. కొద్ది నెలలుగా రాహుల్ బీహార్ కేంద్రీకృతంగా పలు మార్లు పర్యటనలు జరిపారు, బెగుసరాయ్‌కు వెళ్లారు. వలసలు ఆపండి, ఉపాధి కల్పించండనే నినాదంతో ఆయన పర్యటన సాగింది. బీహార్‌లోని యువత ఇక్కడి నిరుద్యోగం , కరువు ఇతర సమస్యలపై స్పందించి చేపట్టిన పాదయాత్రలో రాహుల్ కూడా పాల్గొన్నారు. బెగుసరాయ్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేత కన్హయ్య కుమార్ నేత. ఇక్కడ బహిరంగ సభ జరగలేదు. అయితే వేలాది మంది యువజన కార్యకర్తలతో కలిసి రాహుల్ ఇక్కడ పాదయాత్రలో పాల్గొన్నారు. పలువురు టీ షర్టులు ధరించి యాత్రలో చేరారు, ఆ తరువాత పాట్నాలో జరిగిన సభలో రాహుల్ 40 నిమిషాల పాటు మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ తక్షణ అవసరం అని పిలుపు నిచ్చారు. రాజ్యాంగం కేవలం బుక్ కాదని, తరతరాలుగా అంతర్లీనంగా సాగే ప్రధాన ఇతివృత్తం అని తేల్చిచెప్పారు. సత్యానికి కట్టుబడని సావర్కర్ వంటి వారి నుంచి స్ఫూర్తి పొందిన పార్టీ బిజెపి అని, దీనికి మూలం ఆర్‌ఎస్‌ఎస్ అని విమర్శించారు. సత్యం విశ్వసించే నెహ్రూ గాంధీ వంటి వారి సిద్థాంతాలకు భిన్నంగా వర్తమాన చరిత్రను బిజెపి నెలకొల్పుతోందని విమర్శించారు. లోక్‌సభలో అనుకున్న 400 సీట్లు తెచ్చుకుని ఉంటే మోడీ ఏకంగా రాజ్యాంగానికి ద్రోహం చేసేవారని, తిరగరాసేవారని , తక్కువ బలంతో ఇప్పుడు ఆయన ఆటలు సాగకుండా పొయ్యాయని తెలిపారు. దేశ వ్యాప్త కులగణన అత్యవసరం.
అవలక్షణ నిర్థారణకు ఎక్స్‌రే
శరీరంలో ఎక్కడ అవలక్షణం ఉందనేది తేల్చుకోవడానికి ఎక్స్ రే అవసరం. అదే విధంగా కులగణనతో సామాజిక అన్యాయం గురించి తేటతెల్లం అవుతుంది. అయితే ఎక్కడ తమ తప్పుడు పనులు వెలుగులోకి వస్తాయో అనే భయంతో మోడీ ప్రభుత్వం కులగణనకు వ్యతిరేకంగా ఉందని, అట్టడుగు వర్గాల బలోపేతాన్ని వివిధ సాకులతో అడ్డుకొంటోందని విమర్శించారు. 50 శాతం పరిమితి అనే అడ్డంకులను తొలిగించుకోవల్సి ఉంటుంది. అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల కోటా పెరగాల్సి ఉంది. ఇదే విషయాన్ని తాను పార్లమెంట్‌లో ప్రధాని మోడీకి చెప్పానని, ధైర్యముంటే కోటా పరిథి పెంచాలని అప్పుడు తాము కూడా చేయాల్సింది చేస్తామని ప్రతిపాదించినట్లు వివరించారు. అయితే యధావిధిగా మోడీ నుంచి ఎటువంటి స్పందన లేదని తెలిపారు. తాను పాదయాత్రల దశల్లో పలువురు మెడికల్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయెట్లతో మాట్లాడానని వారి సాథకబాధకాలు తెలుసుకున్నానని రాహుల్ వివరించారు. ప్రస్తుత వ్యవస్థ ప్రతిభకు, సమర్థతకు పట్టం కట్టడం లేదని అనేక మంది చెప్పారని , వ్యవస్థలో మార్పు అనివార్యం అన్నారు. కేవలం అతి కొద్ది మంది గుప్పిట్లో వ్యవస్థ కేంద్రీకృతం అయి ఉంటే ఇక పరిపూర్ణ న్యాయం కుదురుతుందా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు
సమాజంలోని నిజస్వరూపాన్ని, అన్ని వర్గాల న్యాయాన్ని బేరీజు వేసేందుకు తెలంగాణ రాష్ట్రంలోని తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయం అని రాహుల్ ప్రశంసించారు. అక్కడ అణగారిన వర్గాల అభ్యున్నతికి సరైన విధంగా సాథికారతకు కులాల వారి సమగ్ర సర్వే నిర్వహించారని తెలిపారు. అవసరం అయిన వర్గాల సాథికారికత అత్యవసరం. ఇందుకు సరైన శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలి. ఈ దిశలోనే తెలంగాణలోని తమ ప్రభుత్వం సర్వే చేపట్టిందని ఆయన కితాబు ఇచ్చారు.