ఢిల్లీ లో ఓబిసి ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ధర్నా
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఓబిసి కులగణన జరగాలని వక్తలు డిమాండ్ చేశారు. క్రీమీ లేయర్ ను పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఓబిసి ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాకు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపి ఆర్. కృష్ణయ్య, మాజీ ఎంపి వి. హనుమంతరావు, మాజీ ఎంపి ఆనంద్ భాస్కర్, ఆల్ ఇండియా ఫెడరేషన్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కరుణానిధి, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రావు, లాల్ కృష్ణ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ క్రిమిలేయర్ పూర్తిగా ఎత్తివేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం మానేయాలని, ఓబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, 50శాతం రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేయాలని, జ్యుడిషియరీ, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఓబిసిలకు మండల కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఈ సందర్భంగా వక్తలు డిమాండ్ చేశారు.