Thursday, January 23, 2025

లంకలో అంధకారం

- Advertisement -
- Advertisement -

కొలంబో : ఆర్థిక సంక్షోభాల నడుమనే శ్రీలంకలో తీవ్రస్థాయిలో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. 48 గంటలుగా దేశంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీనితో పలు ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్సలకు ఇబ్బంది ఏర్పడింది. దేశమంతటా బ్లాకౌట్ పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ వ్యవస్థలో ప్రధాన వైఫల్యం ఏర్పడటంతో కరెంటు సరఫరా దిగజారింది. సిలోన్ ఎలక్ట్రిసిటి బోర్డు (సెబ్) అధికార ప్రతినిధి నోయిల్ ప్రియాంత అందించిన సమాచారం మేరకు రాయిటర్ వార్తాసంస్థ విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు, లోపాలను సరిదిద్ది విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఎప్పటిలోగా విద్యుత్ సరఫరా క్రమబద్థీకరణ జరుగుతుందనేది చెప్పలేమన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వ్యాపార సంస్థలు, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. ఎటిఎంలు, సెల్‌ఫోన్ల పనిచేయని స్థితి ఏర్పడింది. బ్లాకౌట్లతో భద్రతా ఏర్పాట్లకు ఇబ్బంది ఏర్పడుతోంది.

ప్రత్యేకించి పలు భద్రతా కార్యాలయాలకు ఉండే అలారం వ్యవస్థలు , ఎలక్ట్రానిక్ ఫెన్స్‌లు పనిచేయకుండా పోతాయని, దీనితో ప్రస్తుత ఆర్థిక సంక్షభ దశలో నేరస్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సరఫరా వ్యవస్థలో లోపంతో దేశవ్యాప్తంగా శనివారం సాయంత్రం ఐదున్నర గంట నుంచి కరెంట్ లేకుండా పోయింది. రాత్రి పూర్తిగా అంధకార బంధురం అయింది. ఉన్నట్లుండి పూర్తిస్థాయిలో విద్యుత్ సంక్షోభం నెలకొనడానికి కారణాలు ఏమిటనేది తెలియలేదు. గత ఏడాది కూడా దేశంలో విద్యుత్‌సంక్షోభం నెలకొంది. సాంకేతిక కారణాలతో ఇప్పుడు వ్యవస్థలో లోపాలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరాకు ఎక్కువ సేపు అంతరాయం ఏర్పడితే అది ఇతరత్రా సమస్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News