పోలీసు మెడల్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ ఆలీ
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న తెలంగాణా పోలీసులకు దేశ వ్యాప్త ప్రశంసలు లభిస్తున్నాయని హోం మంత్రి మహమ్మద్ మమామూడ్ అలీ పేర్కొన్నారు. నగరంలోని రవీంధ్రభారతిలో శుక్రవారం నాడు జరిగిన రాష్ట్ర పోలీసులకు ఉత్తమ సేవా పథకాల ప్రధాన కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 669 మంది పోలీసులకు శౌర్య, మహోన్నత సేవ, ఉత్తమ సేవ, కఠిన, సేవ పతకాలను హోం మంత్రి తన చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్బంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ శాఖకు సిఎం కెసిఆర్ అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని, ఇందులో భాగంగా శాఖాపరంగా మౌలిక సదుపాయాల కల్పన, ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం, వాహనాల కొనుగోలు, పోలీస్ స్టేషన్ల భవనాల నిర్మాణం, పోలీస్ నియామకాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని, డ్రగ్స్, పేకాట క్లబ్బులు, మట్కా జూదాలను ఉక్కు పాదంతో అణచివేస్తున్నామన్నారు.
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నివ్వడంతోపాటు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సిసి కెమెరాల వల్ల నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పోలీసులు పకడ్బందీగా పరిరక్షించడం వల్లే రాష్ట్రం పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందన్నారు. అనంతరం డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాములాంటిదని, నిరంతరం 24/7 పోలీసులు ప్రజా సేవలో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. విధి నిర్వహణలో ప్రతిభతో పాటు ఉత్తమ సేవలందించిన పోలీసులకు సేవా పతకాలను అంద చేయడం జరుగుతుందని, ఈ పతకాల స్పూర్తితో వారు మరింత అంకిత భావంతో పనిచేయాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎసిబి డిజి అంజనీ కుమార్, అడిషనల్ డిజి జితేందర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, బెటాలియన్స్ అడిషనల్ డిజి అభిలాష బీస్త్, ఇతర అధికారులు పాల్గొన్నారు.