ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం వింగ్ పరంగా నేచర్ క్యాంపులు, ట్రెక్కింగ్, క్యాంపింగ్, బర్డ్ వాచింగ్, అడ్వెంచర్ కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని టిఎస్‌ఎఫ్‌డిసి. ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. రానున్న రోజుల్లో ప్రకృతి పర్యాటకానికి పెద్ద పీట వేసి నేచర్ క్యాంపులను ప్రోత్సాహస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎకో టూరిజం కార్యక్రమాలలో భాగంగా ఆదివారం ఫారెస్ట్ ట్రేక్ పార్క్ నందు ‘నేచర్ క్యాంపు’ ఏర్పాటు చేసి నిర్వహించారు.
ఈ నేచర్ క్యాంపు లో సరోజినీ నాయుడు వనిత మహా విద్యాలయ కళాశాల హైదరాబాద్ నుండి 30 మంది విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ నేచర్ క్యాంపు రెండు రోజుల పాటు కొనసాగి సోమవారం ముగిసింది. ఈ నేచర్ క్యాంపు తొలుత ఫారెస్ట్ ట్రెక్ పార్క్ వద్ద మొదలు కాగా వారికి ఎకో టూరిజం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ కళ్యాణపు సుమన్ లు ఈ నేచర్ క్యాంపులో జరగబోయే వరుస కార్యక్రమాలు..టైం స్లాట్స్ గురించి వివరించారు. తర్వాత హైకింగ్ చేస్తూ మర్రిచెట్టు రచ్చబండ దగ్గర ఏర్పాటు చేసిన టీం బిల్డింగ్ కార్యక్రమాలలో అసక్తిగా పాల్గొన్నారు. అనంతరం చెక్ డ్యాం పాండ్ వద్ద ఏర్పాటు చేసిన క్యాంపింగ్ సైట్ కి చేరుకొని టెంట్ ఎలా వేసుకోవాలో వారందరికీ డెమో ఇచ్చి వారితోనే టెంట్ పిచింగ్ ఏర్పాటు చేయించారు. భోజనం అనంతరం అందరికీ రాత్రి దీపాలు (లాంథర్స్) ఇచ్చి రాత్రి ట్రెక్కింగ్ కూడా చేయించారు. ట్రెక్కింగ్ అనంతరం క్యాంపు వద్ద క్యాంపు ఫైర్ ఏర్పాటు చేసి వారిచే వినోదాన్ని పంచే పలు కార్యక్రమాలను చేయించారు. అనంతరం బర్డ్ వాక్ కార్యక్రమం ఏర్పాటు చేసి 27 రకాల పక్షులను తిలకించేలా చూశారు.